హెచ్-1బీ వీసాలపై అమెరికా ప్రతిపాదించిన భారీ ఫీజుల పెంపుపై ఇండియన్-అమెరికన్ అడ్వొకసీ సంస్థ ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పొరా స్టడీస్ (FIIDS) ఆందోళన వ్యక్తం చేసింది.ఈ అసాధారణ స్థాయిలో ఫీజులు పెంచడం వల్ల చట్టబద్ధమైన నియామకాలు దెబ్బతినడంతో పాటు.. అధిక వేతనాలు లభించే ఉద్యోగాలు అనుకోకుండా ఇతర దేశాలకు తరలిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది.
భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి..అమెరికా జాతీయ భద్రతను పరిరక్షించడం, మోసాలను అరికట్టడం, చట్టబద్ధమైన వలసలను ప్రోత్సహించడం కోసం హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం, యూఎస్సీఐఎస్ (USCIS)కు తగిన వనరులు సమకూర్చడం అవసరమేనని FIIDS పేర్కొంది.అయితే హెచ్-1బీ వీసా ఫీజును ఏకంగా 1,03,265 డాలర్లకు పెంచడం మాత్రం ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న స్టార్టప్‌లపై తీవ్ర భారం మోపుతుందని తెలిపింది.
కంపెనీలపై భారీ భారం..
వేలాది మంది హెచ్-1బీ ఉద్యోగులను నియమించుకునే సంస్థలు ఈ ఫీజు పెంపుతో వందల మిలియన్ల డాలర్ల అదనపు వ్యయాన్ని భరించాల్సి వస్తుందని FIIDS వివరించింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో ఉద్యోగులను నియమించుకోవడం కంటే.. అధిక వేతనాలు అందించే ఉద్యోగాలను ఇతర దేశాలకు తరలించేందుకు కంపెనీలు మొగ్గు చూపే అవకాశం ఉందని పేర్కొంది.
ఓపీటీ ఫీజుపైనా ఆందోళన..
ఫలితంగా అమెరికా కార్మిక మార్కెట్‌పైనా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.ఇప్పటికే అమెరికా విద్యాసంస్థల్లో విదేశీ విద్యార్థుల చేరిక తగ్గుతోందని FIIDS గుర్తుచేసింది.ఇలాంటి సమయంలో ఎఫ్-1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ (OPT) ప్రోగ్రామ్‌కు కూడా దాదాపు లక్ష డాలర్ల ఫీజు విధిస్తే.. అమెరికా ఉన్నత విద్యా రంగానికి మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.అమెరికా కార్మికులకు రక్షణ కల్పించడంతో పాటు.. సాంకేతిక రంగంలో అగ్రరాజ్యంగా ఉన్న స్థానాన్ని కొనసాగించడం రెండూ ఒకేసారి సాధ్యమయ్యేలా విధానాలను రూపొందించాలని ఇండియన్-అమెరికన్ సంస్థ సూచించింది.
ట్రంప్ సర్కారు మరో కీలక ప్రతిపాదన..
హెచ్-1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి ట్రంప్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.హెచ్-1బీ వీసా దరఖాస్తులపై కొత్తగా 1,03,265 డాలర్ల ఫీజును ప్రతిపాదించింది.ఇదే సమయంలో ఎఫ్-1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్‌పైనా దాదాపు లక్ష డాలర్ల మేర కొత్త ఫీజు విధించే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ ప్రతిపాదనల నేపథ్యంలోనే FIIDS తన తాజా ప్రకటనను విడుదల చేసింది.


