Homeతెలంగాణకొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ వర్సిటీతో తెలంగాణ ఒప్పందం

కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ వర్సిటీతో తెలంగాణ ఒప్పందం

- Advertisement -

తెలంగాణలో క్రీడాభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయ, ఒలింపిక్స్‌ వేదికలపై సత్తా చాటేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ (కేఎన్‌ఎస్‌యూ)తో ‘యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ విశ్వవిద్యాలయం’ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో తాజాగా జరిగిన కార్యక్రమంలో కేఎన్‌ఎస్‌యూ ప్రతినిధుల బృందం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ నేతృత్వంలోని బృందం ఒప్పందంపై సంతకాలు చేసింది.ఈ భాగస్వామ్యంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, క్రీడాకారుల ప్రతిభను గుర్తించడం, శిక్షణ అందించడం తదితర అంశాల్లో కేఎన్‌ఎస్‌యూ తెలంగాణకు సహకరించనుంది.

ఐదేళ్లపాటు అమల్లో ఎంవోయూ
ఈ అవగాహన ఒప్పందం ఐదేళ్లపాటు అమల్లో ఉంటుంది. ఇరు సంస్థల పరస్పర అంగీకారంతో దీనిని తదుపరి కాలానికి పునరుద్ధరించుకోవచ్చు.ఒప్పందంలో భాగంగా అకడమిక్‌ కార్యక్రమాల నిర్వహణ, పాఠ్య ప్రణాళికల రూపకల్పన, విద్యా ప్రమాణాల మెరుగుదల వంటి అంశాల్లో రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి.అంతేకాకుండా అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, క్రీడారంగ నిపుణుల పరస్పర మార్పిడికి అవకాశం కల్పించనున్నారు.క్రీడలకు సంబంధించిన వివిధ అంశాలపై సంయుక్తంగా పరిశోధనలు చేపట్టడంతోపాటు పరిశోధనా పత్రాల ప్రచురణలోనూ ఇరు సంస్థలు సహకరించుకోనున్నాయి.

2024లో సీఎం పర్యటనతో ప్రారంభమైన ప్రయత్నాలు..
ఈ భాగస్వామ్యానికి బీజం 2024లో పడింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2024 ఆగస్టులో దక్షిణ కొరియాలో పర్యటించిన సందర్భంగా కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీని సందర్శించారు.అప్పట్లో జరిగిన పారిస్‌ ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియా 32 పతకాలు సాధించింది. ఈ విజయాల్లో కేఎన్‌ఎస్‌యూలో శిక్షణ పొందిన క్రీడాకారుల పాత్ర గణనీయంగా ఉంది.కేఎన్‌ఎస్‌యూ నుంచి శిక్షణ పొందిన క్రీడాకారుల ప్రతిభను సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు.తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ విశ్వవిద్యాలయానికి సాంకేతిక భాగస్వామిగా వ్యవహరించాలని కేఎన్‌ఎస్‌యూ ప్రతినిధులను కోరారు.అదే సమయంలో స్పోర్ట్స్‌ సైన్స్‌ సెంటర్, స్పోర్ట్స్‌ మెడిసిన్‌ సెంటర్‌తోపాటు 12 రకాల క్రీడా అకాడమీలను ఏర్పాటు చేసే అంశంపైనా చర్చలు జరిగాయి.

క్రీడా భాగస్వామ్యంలో కీలక వారధి: సీఎం
తెలంగాణతో క్రీడా భాగస్వామ్యంపై దక్షిణ కొరియా అధ్యక్షుడు, కేఎన్‌ఎస్‌యూ ప్రతినిధులతో సీఎం ప్రత్యేకంగా చర్చలు జరిపారు.నాడు రేవంత్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఎంవోయూ రూపంలో కార్యరూపం దాల్చాయి.ఈ ఒప్పందంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు.కీలక ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లిన రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, అధికారులను ఆయన అభినందించారు.2024లో దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీతో జరిపిన చర్చలు ఇప్పుడు ఫలించాయని సీఎం పేర్కొన్నారు.తెలంగాణ, దక్షిణ కొరియా మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం కీలక వారధిగా నిలుస్తుందని తెలిపారు.

క్రీడారంగానికి మైలురాయి: మంత్రి శ్రీహరి
తెలంగాణలోని గ్రామాలు, పట్టణాల నుంచి ఒలింపిక్స్‌ వేదిక వైపు ప్రయాణం ప్రారంభమైందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.2036 ఒలింపిక్స్‌ను లక్ష్యంగా చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచే అథ్లెట్లను తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.కేఎన్‌ఎస్‌యూతో యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ విశ్వవిద్యాలయం ఒప్పందం కుదుర్చుకోవడం తెలంగాణ క్రీడారంగంలో కీలక మైలురాయని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.ఈ భాగస్వామ్యంతో రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలకు మరింత చేరువ కానున్నారని ఆయన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు