అమెరికాకు ఇరాన్ హెచ్చరిక… నెతన్యాహుపై మండిపాటు
తెహ్రాన్: నౌకా దిగ్బంధం కొనసాగించడమంటే ఘర్షణను తీవ్రతరం చేయడమేనని అమెరికా చర్యలను ఇరాన్ ఆక్షేపించింది. పరిస్థితి ఇలానే ఉంటే అమెరికా ఆర్థిక ప్రయోజనాýను 100 శాతం లక్ష్యంగా చేసుకుంటామని, బలంగా దెబ్బ కొడతామని ఇరాన్ సర్వోన్నత జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మేజర్ జనరల్ మోసిన్ రెజాయ్ హెచ్చరించారు. అలాగే, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును నరకానికి పంపుతామన్నారు. మళ్లీ యుద్ధం మొదలైతే అది కొత్త తరహాలో ఉండబోతోందని వ్యాఖ్యానించారు. తమ నౌకా మార్గాన్ని దిగ్బంధించిన అమెరికాకు చుక్కలు చూపిస్తామని శుక్రవారం మీడియాతో మాట్లాడిన రెజాయ్ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు బ్యారోన్ హత్యకు ఇరాన్ ప్రయత్నించినట్లు నెతన్యాహు కట్టుకథ అల్లారని, ట్రంప్‌ను ఆందోళనకు గురి చేశారని వ్యాఖ్యానించారు. నెతన్యాహు తప్పుడు నిర్ణయాలు ఇజ్రాయిల్ పాలనకు ముగింపు పలకబోతుందని నిరూపిస్తామన్నారు. ట్రంప్ కుమారుడి హత్యకు ఇరాన్ ఎలాంటి ప్రయత్నం చేయలేదని, అదంతా నెతన్యాహు తప్పుడు ప్రచారమని రెజాయ్ వెల్లడించారు. నెతన్యాహును నరకానికి పంపుతామని హెచ్చరించారు. లెబనాన్ గురించి ప్రస్తావిస్తూ దహియే, బీరుట్ ప్రాంతాలు ఇరాన్‌కు రెడ్ లైన్స్ అని అన్నారు. లెబనాన్ఇజ్రాయిల్ ఘర్షణను నిశితంగా సమీక్షిస్తున్నట్లు తెలిపారు. లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయిల్ వెనక్కు తగ్గడం ఖాయమని రెజాయ్ అన్నారు. యుద్ధం మళ్లీ మొదలైతే అది కొత్త దశలోకి అడుపెట్టినట్టేనన్నారు. అందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గత ఘర్షణకు పూర్తి భిన్నంగా సైనిక చర్యలు ఉంటాయని రెజాయ్ హెచ్చరించారు. అమెరికా వెనక్కి తగ్గకపోతే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని కూడా స్పష్టంచేశారు. కాల్పుల విరమణ అమల్లో ఉన్న కాలంలో 7080 మిలియన్ల బ్యారళ్ల చమురును ఎగుమతి చేశామన్నారు. దిగ్బంధాన్ని తెహ్రాన్ తెగొట్టిందని రెజాయ్ వెల్లడించారు.


