- 31 నుంచి దశల వారీ కార్యాచరణ
- సీఎస్ కార్యాలయంలో ఉద్యమ నోటీసు అందజేత
- ఏఐటీయూసీ, సీఐటీయూ సంపూర్ణ మద్దతు
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం దశల వారీ ఉద్యమ శంఖారావం పూరించినట్లు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర సదస్సులో నేతలు వెల్లడించారు. 13 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ఉద్యోగుల సమస్యలపై సీరియస్‌గా చర్చించి… జిల్లా నాయకత్వాల నిర్ణయం మేరకు ప్రకటించిన ఉద్యమ కార్యాచరణను రాష్ట్ర నాయకత్వం అమలు చేస్తుందని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని పోరాటాల్లోను ప్రత్యక్షంగాను, పరోక్షంగాను పాల్గొంటామని ఏఐటీ యూసీ, సీఐటీయూ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉద్యమ నోటీసు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. శుక్రవారం విజయవాడ మాకీనేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర సదస్సు నిర్వహించింది. చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే అనేక మార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ, వినతిపత్రాలు అందజేయడంతో పాటు చర్చలు, సమావేశాలు నిర్వహించినప్పటికీ నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం చేస్తోందన్నారు. గతంలో 11వ పీఆర్సీపై చలో విజయవాడ తరహా పోరాటాలు చేసి సాధించుకున్నామని చెప్పారు. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని…తమకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్నామన్నారు. గత ప్రభుత్వం నుంచి నేటి వరకు రూ.40వేల కోట్లపైబడి పీఆర్సీ, డీఏ, సరెండర్ లీవ్‌లు, ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాడ్యుటీ, లీవ్ ఎన్ క్యాష్మెంట్, అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ తదితర బకాయిలు పేరుకుపోయాయని వివరించారు. ఎన్నికల ముందు కూటమి మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నదే ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ ఉద్యమం వల్ల ప్రజలకొచ్చే ఇబ్బందులకు ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. ఉద్యమ కమిటీ చైర్మన్ టీవీ ఫణి పేర్రాజు మాట్లాడుతూ ఆర్థిక పరమైన సమస్యల పరిష్కారంలో కొనసాగుతున్న జాప్యం వల్ల ఉద్యోగులంతా నిరుత్సాహంతో ఉన్నారని చెప్పారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.రవీంద్రనాథ్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎస్.వెంకటసుబ్బ య్య, సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ… ప్రభుత్వాన్ని ఉద్యోగులు గొంతెమ్మ కోర్కేలు కోరడంలేదని, వారి న్యాయమైన డిమాండ్ల కోసం జరిగే పోరాటాలకు పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తామన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని పోరాటాల్లోను ప్రత్యక్షంగాను, పరోక్షంగాను పాల్గొంటామని హామీ ఇచ్చారు. ఏపీజేఏసీ అమరావతి చేపట్టిన ఉద్యమానికి ఏపీ స్టేట్ ఎలక్రిట్సిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వైఎన్వీ సురేశ్ కుమార్, ఆర్టీసీ ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ సంఘీభావం తెలిపారు. రాష్ట్ర సదస్సు ముగిసిన వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ను కలిసి ఉద్యమ కార్యాచరణ నోటీసు అందజేయడానికి ఏపీ జేఏసీ అమరావతి నాయకత్వం వెళ్లగా…ఆయన అందుబాటులో లేకపోవడంతో వారి కార్యాలయంలో సిబ్బందికి నోటీసు అందజేశారు.
ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్ ఈ విధంగా…
మొదటి దశ ఉద్యమ కార్యాచరణ ఈ నెల 31వ తేదీ నుంచి సెప్టెంబరు 11వరకు కొనసాగనుంది. 31న పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్లను కలిసి ఉద్యమ కార్యాచరణ నోటీసులు అందజేయడంతో పాటు సెప్టెంబర్ 15 నుంచి వర్క్ రూల్ ప్రారంభిస్తున్న సమాచారాన్ని కలెక్టర్లకు తెలియజేయాలి. సెప్టెంబరు 1న ‘సీఎం సార్…మా డబ్బులు మాకివ్వండి’ నినాదం తో ప్రతి ఉద్యోగి సెల్‌ఫోన్ డీపీ పెట్టుకుంటారు. 5వ తేదీవరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారు. 2నుంచి 8 వరకు అన్ని డివిజన్, జిల్లా కార్యాలయాలను సందర్శించి ఉద్యోగులను ఉద్యమంలో భాగస్వాములను చేస్తారు. అలాగే రెండో దశ ఉద్యమ కార్యాచరణ సెప్టెంబరు 15 నుంచి 26 వరకు విభిన్న నిరసనలతో జరుగుతుంది. మూడో దశ ఉద్యమంలో భాగంగా మల్టీజోన్ స్థాయిలో సదస్సులు, సహాయనిరాకరణ, రిలే దీక్షలు, చలో విజయవాడ, నిరవధికసమ్మె లాంటి ఉధృత కార్యచరణను కలిసి వచ్చే సంఘాలతో నిర్వహిస్తారు. ఈ సదస్సులో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు, ఏపీ పీఆర్ ఇంజినీరింగ్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.శ్రీనివాసరావు, రాష్ట్ర లేబర్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.కిషోర్ కుమార్, ఏపీ ప్రభుత్వ డాక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డి.జయధీర్, మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.కృష్ణ మోహన్‌రావు, మహిళా విభాగం స్టేట్ చైర్ పర్సన్ పి.లక్ష్మీ, సెక్రటరీ జెనరల్ పొన్నూరు విజయలక్ష్మీ, మెడికల్ విమెన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మీతోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్దఎత్తున ఉద్యోగులు హాజరయ్యారు.


