Homeకేంద్రం కోత… అప్పులే బాట

కేంద్రం కోత… అప్పులే బాట

- Advertisement -
  • వార్షిక అంచనాల్లో కేంద్రం ఇచ్చింది 9 శాతమే
  • తొలి నాలుగు నెలల్లో రూ.2,956 కోట్లే విడుదల
  • 5 నెలల్లోనే రూ.55,534 కోట్ల అప్పులు
  • నాలుగు నెలల్లో రూ.36,942 కోట్ల రెవెన్యూ లోటు
  • ‘కాగ్’ నివేదిక వెల్లడి

విశాలాంధ్ర-సచివాలయం : రాష్ట్రానికి రావాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కులు, గ్రాంట్లు, నిధుల కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణినే కొనసాగిస్తోంది. ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని ఆదుకోవాల్సింది పోయి బడ్జెట్ అంచనాలకు ఏమాత్రం పొంతన లేని రీతిలో నిధులకు కోత విధిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల కాలంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కేవలం 9.11 శాతం మాత్రమే విడుదల కావడం రాష్ట్ర ఖజానాపై మోయలేని భారాన్ని మోపింది. రోజువారీ పాలన నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధులు లభించక ఖజానా తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఫలితంగా ప్రతి నెలా బడ్జెట్ పరిమితులకు మించి భారీ ఎత్తున అప్పుల బాట పట్టాల్సి వస్తోంది. కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజాగా విడుదల చేసిన జులై నెల ఆర్థిక నివేదికలో ఈ సంచలన నిజాలు బయటపడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాలు, గ్రాంట్ల రూపంలో రూ.32,358 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేసింది. అయితే జులై నాటికి కేంద్రం నుంచి రాష్ట్రానికి దక్కింది కేవలం రూ.2,956 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఇది మొత్తం వార్షిక అంచనాలో కేవలం 9.11 శాతం మాత్రమే కావడం గమనార్హం. కేంద్రం నుంచి ఆశించిన రీతిలో సహాయం అందకపోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక చక్రం తీవ్రంగా మందగించింది. కేంద్ర పన్నులలో రాష్ట్ర వాటా కింద జులై వరకు రూ.10,672.73 కోట్లు లభించాయి.
భారీగా పెరిగిన రెవెన్యూ వ్యయం
ఆదాయం మందగించినప్పటికీ ప్రభుత్వం చేసే రెవెన్యూ వ్యయం మాత్రం ఊహించని రీతిలో పెరిగింది. తొలి నాలుగు నెలల్లోనే ఏకంగా రూ.91,001.56 కోట్లను ఖర్చు చేశారు. అంటే మొత్తం బడ్జెట్ అంచనాలో ఇప్పటివరకు 35.53 శాతం వ్యయమైంది. ఇందులో ప్రాథమిక అవసరాలకే సింహభాగం ఖర్చయింది. ఉద్యోగుల వేతనాల కోసం రూ.20,434.17 కోట్లు, తీసుకున్న అప్పుల వడ్డీ చెల్లింపుల కోసం రూ.13,329.18 కోట్లు, పెన్షన్లు, ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం రూ.13,120.02 కోట్లు, సంక్షేమ సబ్సిడీలకు రూ.11,692.14 కోట్లు వెచ్చించారు. వస్తున్న రెవెన్యూ రాబడులు రూ.54,059.20 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం ఏకంగా రూ.91,001.56 కోట్లకు చేరడంతో ఆదాయానికి, వ్యయానికి మధ్య రూ.36,942.36 కోట్ల భారీ రెవెన్యూ లోటు నమోదయింది. రాష్ట్ర భవిష్యత్, మౌలిక సదుపాయాల కల్పన, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కీలకమైన మూలధన వ్యయానికి బడ్జెట్లో రూ.48,697.70 కోట్లు కేటాయించగా, జులై నాటికి కేవలం రూ.9,963.76 కోట్లు (20.46 శాతం) మాత్రమే ఖర్చు చేశారు. మొత్తం రంగాల వారీగా వ్యయాన్ని పరిశీలిస్తే సాధారణ రంగంపై రూ.32,942.86 కోట్లు, సామాజిక రంగంపై రూ.47,571.23 కోట్లు, ఆర్థిక రంగంపై రూ.20,451.23 కోట్లు ఖర్చు చేశారు.
ఏడాది బడ్జెట్ అప్పుల లక్ష్యంలో ఇప్పటికే 65 శాతం పూర్తి
ఆశించిన విధంగా కేంద్ర నిధులు అందకపోవడంతో లోటును భర్తీ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో అప్పుల బాట పట్టింది. ప్రస్తుత సంవత్సరంలో రూ.75,869 కోట్ల రుణాన్ని స్వీకరించాలని బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకోగా, మొదటి నాలుగు నెలల కాలంలోనే ఏకంగా రూ.49,171 కోట్లు (65 శాతం) రుణాలను స్వీకరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి నెలకు సరాసరి రూ.11 వేల కోట్లకు పైగా బడ్జెట్ అప్పులు చేయగా, గత ఐదు నెలల వ్యవధిలోనే మొత్తం రాష్ట్ర అప్పు రూ.55,534 కోట్లకు చేరింది. దీనికి తోడు ఇటీవల నిర్వహించిన ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా మరో రూ.2,600 కోట్ల అప్పను కూడా ప్రభుత్వం సేకరించింది. మరోవైపు ఆర్థిక సంస్థలు ఇచ్చే అప్పులకు కూటమి ప్రభుత్వం తరచూ గ్యారంటీలు ఇస్తూ ఉత్తర్వులు (జీవోలు) జారీ చేస్తుండటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత 26 నెలల సుదీర్ఘ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.3,86,348 కోట్ల మేర భారీగా అప్పులు చేసినట్లు సమాచారం. నెలవారీగా పన్నుల ద్వారా వచ్చే రాబడి కంటే ప్రభుత్వం చేసే అప్పలే ఎక్కువగా ఉండటంతో వాటిపై చెల్లించాల్సిన వడ్డీలు రాష్ట్ర ఖజానాకు గుదిబండగా మారుతున్నాయి. తాజా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం మొత్తం రెవెన్యూ రాబడులు రూ.2,34,140.14 కోట్లుగా అంచనా వేయగా, జులై చివరి నాటికి రూ.54,059.20 కోట్లు సమకూరాయి. ఇది మొత్తం వార్షిక అంచనాల్లో 23.09 శాతంగా ఉంది. రాష్ట్ర సొంత పన్నుల విషయానికి వస్తే, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ద్వారా రూ.17,974.67 కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా రూ.6,966.85 కోట్లు, రాష్ట్ర ఎక్సైజ్ సుంకాల ద్వారా రూ.6,937.87 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా రూ.4,092.12 కోట్లు సమకూరాయి. అలాగే భూముల అమ్మకం ద్వారా రూ.17.64 కోట్ల రాబడి వచ్చినట్లు కాగ్ వెల్లడించింది. మూలధన వ్యయాన్ని పక్కనపెట్టి కేవలం రోజువారీ ఖర్చులు, వడ్డీల కోసమే అప్పులు చేస్తుండటంతో రాష్ట్రంలో అభివృద్ధి కేవలం మాటలకే పరిమితమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుల భారం ఈ రకంగానే కొనసాగితే రానున్న నెలల్లో ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు