Homeజాతీయంరాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకోకుంటే రాజీనామా చేస్తాం..

రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకోకుంటే రాజీనామా చేస్తాం..

- Advertisement -

విజయ్ పార్టీకి కాంగ్రెస్ అల్టిమేటం
తమిళనాడులో అధికార సంకీర్ణ ప్రభుత్వంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. 2029 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని అంగీకరించకపోతే, తాము కేబినెట్ నుంచి వైదొలుగుతామని మిత్రపక్షమైన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని కాంగ్రెస్ మంత్రులు హెచ్చరించారు. ఈ పరిణామం ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కన్యాకుమారిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి ఎస్. రాజేశ్ కుమార్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. “2029లో రాహుల్ గాంధీయే కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి. ఆయనే తదుపరి ప్రధాని అవుతారు. ఒకవేళ ఈ ప్రతిపాదనను టీవీకే అంగీకరించడానికి నిరాకరిస్తే, కేబినెట్‌లో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ మంత్రులం తక్షణమే రాజీనామా చేసి బయటకు వస్తాం” అని ఆయన స్పష్టం చేశారు. పార్టీ లక్ష్యం ఇదేనని, కార్యకర్తలందరూ దీనికే ప్రాధాన్యత ఇస్తారని ఆయన అన్నారు.

వివాదానికి కారణమేమిటి?
ఇటీవల కాలంలో పలువురు టీవీకే నేతలు తమ అధినేత, సీఎం విజయ్‌ను జాతీయ స్థాయి నేతగా, భవిష్యత్ ప్రధానిగా అభివర్ణించడమే ఈ వివాదానికి ఆజ్యం పోసింది. మానవ వనరుల శాఖ మంత్రి డి. శరత్‌కుమార్ ఏకంగా అసెంబ్లీలోనే మాట్లాడుతూ “విజయ్ తదుపరి భారత ప్రధాని” అని వ్యాఖ్యానించారు. మరో మంత్రి, ఆధవ్ అర్జున మాట్లాడుతూ దేశానికి దక్షిణాది నుంచి ప్రధాని రావాల్సిన అవసరం ఉందని వాదించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘనవిజయం తర్వాత విజయ్ నాయకత్వంపై జాతీయ స్థాయిలో ఆసక్తి పెరుగుతోందని మరికొందరు టీవీకే నేతలు పేర్కొంటున్నారు. ఈ ప్రచారమే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

కాంగ్రెస్ బలం.. వైఖరి
టీవీకే నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ గట్టిగా స్పందించింది. 2029 ఎన్నికలకు రాహుల్ గాంధీ మాత్రమే తమ ఏకైక జాతీయ అభ్య‌ర్థి అని ఉన్నత విద్యాశాఖ మంత్రి పి. విశ్వనాథన్‌ సహా పలువురు కాంగ్రెస్ నేతలు పునరుద్ఘాటించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడినప్పుడు, ఐదుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ మద్దతుతోనే టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఈ మద్దతు కారణంగానే దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి తమిళనాడు కేబినెట్‌లో చోటు దక్కింది. ఈ రాజకీయ బలాన్నే కాంగ్రెస్ ఇప్పుడు గుర్తు చేస్తోంది.

2024లో నటుడు విజయ్ ప్రారంభించిన టీవీకే పార్టీ, పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే అనూహ్య విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే, 2029 లోక్‌సభ ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ, ప్రధాని అభ్యర్థిపై ఇప్పటి నుంచే మొదలైన ఈ చర్చలు సంకీర్ణ ప్రభుత్వంలో స్పష్టమైన విభేదాలకు దారితీస్తున్నాయి. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు కారణమవుతాయోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు