నేపాల్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. అయితే ఓ హెడ్మాస్టర్ అప్రమత్తత,సమయస్ఫూర్తి కారణంగా దాదాపు 900 మంది విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. వరద ముంచెత్తడానికి కేవలం 10 నిమిషాల ముందు విద్యార్థులను పాఠశాల నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ సమయంలో తాను తీసుకున్న నిర్ణయం గురించి హెడ్మాస్టర్ రాజేంద్ర దవాడీ వివరించారు.
నువాకోట్‌లోని త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్‌కు రాజేంద్ర దవాడీ హెడ్మాస్టర్గా పనిచేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:10 గంటలకు విపత్తు గురించి హెచ్చరిస్తూ తనకు నాలుగు ఫోన్ కాల్స్ వచ్చాయని ఆయన తెలిపారు.ఈ భారీ వరదల కారణంగా ఇప్పటివరకు 794 మంది మరణించగా.. మరో 2,500 మంది ఆచూకీ తెలియకుండా పోయారు.
నాలుగు హెచ్చరికలు.. వెంటనే నిర్ణయం
వరదకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే దవాడీ పాఠశాలను ఖాళీ చేయించాలని నిర్ణయించారు. విద్యార్థులను ఎత్తైన ప్రాంతాలకు పరుగెత్తాలని సూచించారు. విద్యార్థులతో నిండిన బస్సులను కూడా వెనక్కి తిప్పి ప్రమాద ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు.”ఆ సమయంలో త్వరగా నిర్ణయం తీసుకోకపోయినా.. కనీసం మరో 10 నిమిషాలు ఆలస్యం చేసినా విద్యార్థులతో సహా మేమెవరూ ఈరోజు మీతో మాట్లాడటానికి బతికి ఉండేవాళ్లం కాదు” అని దవాడీ తెలిపారు.
కొద్ది నిమిషాల వ్యవధిలో నలుగురు వ్యక్తుల నుంచి వచ్చిన హెచ్చరికలు పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారబోతోందో అంచనా వేయడానికి ఆయనకు ఉపయోగపడ్డాయి.ఓ విద్యార్థి తల్లి చెప్పిన మాటలు కూడా తన నిర్ణయాన్ని మరింత బలపరిచాయని దవాడీ గుర్తుచేసుకున్నారు.”ఒక విద్యార్థి తల్లి పరుగెత్తుకుంటూ వచ్చి..’పెద్ద వరద వస్తోంది. నా కూతురిని తీసుకెళ్లడానికి వచ్చాను’ అని చెప్పింది” అని ఆయన తెలిపారు.
”తల్లిదండ్రులు బలమైన కారణం లేకుండా అంతగా ఆందోళన చెందరు. అందుకే విద్యార్థులను వెంటనే ఖాళీ చేయించాలి అనుకున్నాను. ఒకవేళ వరద రాకపోయినా పిల్లలు ఒకరోజు తరగతులు కోల్పోతారు. అంతకంటే పెద్ద నష్టం ఏమీ ఉండదు కదా అనుకున్నాను” అని దవాడీ చెప్పారు.విద్యార్థుల ప్రాణాలను కాపాడగలిగినందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు.
స్కూల్ భవనం బురదలో..
విద్యార్థులను బయటకు పంపిన కొద్దిసేపటికే పరిస్థితి ఎంత భయంకరంగా మారిందో స్పష్టమైంది. త్రిభువన్ త్రిశూలి స్కూల్ భవనం బురద,శిథిలాల కింద పూర్తిగా కూరుకుపోయింది. నదికి సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న హాస్టల్‌ను కూడా వేగంగా వచ్చిన వరద నీరు క్షణాల్లో ముంచేసిందని దవాడీ తెలిపారు.


