దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో విక్రయించే ఇంధనంలో ఇథనాల్ శాతాన్ని తప్పనిసరిగా వెల్లడించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.పెట్రోల్‌లో ఎంత శాతం ఇథనాల్ కలిపారో వినియోగదారులకు స్పష్టంగా తెలిసేలా డిస్పెన్సింగ్ నాజిల్స్‌పై ఏకరీతి లేబులింగ్ ఏర్పాటు చేయాలని పిటిషనర్, న్యాయవాది నరేంద్ర కుమార్ గోస్వామి కోరారు.అయితే ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ పీబీ వరాలేతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది.”పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం. పిటిషనర్ సంబంధిత అధికారిని ఆశ్రయించవచ్చు” అని స్పష్టం చేసింది.
గోస్వామిని ప్రశ్నించిన ధర్మాసనం.. హైకోర్టుకు వెళ్లాలని సూచన
విచారణ సందర్భంగా గోస్వామి నేరుగా సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారంటూ ధర్మాసనం ప్రశ్నించింది.ముందుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.”మీరు ఎవరు? ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు? హైకోర్టుకు వెళ్లి పిటిషన్ దాఖలు చేయండి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.దీనికి గోస్వామి స్పందిస్తూ.. ”నాకు సమాచారం తెలుసుకునే హక్కు ఉంది. నేను పెట్రోల్ కొనుగోలు చేస్తే అందులో E20 ఉందన్న వివరాలు ఎక్కడా కనిపించడం లేదు” అని తెలిపారు.
బిస్కెట్ ప్యాకెట్‌లో పదార్థాలు తెలిసినట్లే..
కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి గోస్వామి పిటిషన్‌ను వ్యతిరేకించారు.ఇథనాల్ కలిపిన పెట్రోల్ విధానాన్ని సవాలు చేస్తూ గతంలో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.”ఈ విధానాన్ని సవాలు చేస్తూ వచ్చిన పిటిషన్లను మీ గౌరవ న్యాయస్థానం ఇప్పటికే కొట్టివేసింది”అని అటార్నీ జనరల్ తెలిపారు.అయితే తాను E20 విధానాన్నే వ్యతిరేకించడం లేదని గోస్వామి స్పష్టం చేశారు.పెట్రోల్‌లో ఇథనాల్ శాతం ఎంత ఉందో తెలుసుకునే హక్కు తనకు ఉందని చెప్పారు.”నేను ఈ విధానాన్ని సవాలు చేయడం లేదు.నాకు సమాచారం తెలుసుకునే హక్కు ఉంది.మనం ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేసినప్పుడు అందులో ఉన్న పదార్థాలు ఏమిటో తెలుసుకుంటాం కదా” అని వాదించారు.
పాత వాహనాలకు E20తో ఆందోళనలు
దేశంలో ముడి చమురు దిగుమతులను తగ్గించడం, కాలుష్య ఉద్గారాలను నియంత్రించడంలో భాగంగా దేశీయంగా ఉత్పత్తి చేసే జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం E20 కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.ఇందులో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలుపుతారు. అయితే E20 విధానంపై గతంలో పలు ఆందోళనలు వ్యక్తమయ్యాయి.ఓ విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ E20 కార్యక్రమం ఒక ”ప్రయోగం” అని వార్తలు వెలువడ్డాయి.దీంతో కేంద్ర ప్రభుత్వం వాటిపై వివరణ ఇచ్చింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంది.
E20పై కేంద్ర ప్రభుత్వం వివరణ
”ప్రభుత్వం అమలు చేస్తున్న ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (EBP) కార్యక్రమం లేదా E20 కలయిక కార్యక్రమాన్ని ఏ దశలోనూ ‘ప్రయోగం’గా పేర్కొనలేదు.సుప్రీంకోర్టు ముందు E20 కార్యక్రమాన్ని ప్రభుత్వం ‘ప్రయోగం’గా అభివర్ణించిందని చెప్పడం పూర్తిగా తప్పు.కేంద్ర ప్రభుత్వం తరఫున చేసిన వాదనలను ఆ వార్తలు ప్రతిబింబించడం లేదు” అని కేంద్రం జూన్‌లో విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది.
వాహన తయారీ సంస్థలు క్రమంగా E20 ఇంధనానికి అనుకూలంగా ఉండే వాహనాలను తయారు చేస్తున్నప్పటికీ.. 2023కు ముందు విక్రయించిన పాత మోడళ్ల విషయంలో మాత్రం ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఓ కేసులో మారుతీ సుజుకీకి కీలక ఆదేశాలు ఇచ్చింది.E20 ఇంధనం వినియోగం కారణంగా తన వాహనం పాడైందని ఓ వినియోగదారు ఫిర్యాదు చేయగా.. E20కు అనుకూలమైన ఇంజిన్‌తో కొత్త గ్రాండ్ విటారా కారును అందించాలని కంపెనీని ఆదేశించింది.అయితే ఇథనాల్ శాతాన్ని తప్పనిసరిగా వెల్లడించాలంటూ దాఖలైన ప్రస్తుత పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించకుండా కొట్టివేసింది.


