Homeఆంధ్రప్రదేశ్అమరావతిలో క్వాంటమ్‌ ఎకోసిస్టమ్‌లో మరో ముందడుగు.. సీఐఎం ఏర్పాటుకు సిద్ధం

అమరావతిలో క్వాంటమ్‌ ఎకోసిస్టమ్‌లో మరో ముందడుగు.. సీఐఎం ఏర్పాటుకు సిద్ధం

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ఎకోసిస్టమ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.
అమరావతిలో ఐబీఎం క్వాంటమ్‌ కంప్యూటర్‌ అందుబాటులోకి రాకముందే ఈ రంగానికి చెందిన స్టార్టప్‌ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి.ఇందులో భాగంగా విజయవాడలోని స్టేట్‌ డేటా సెంటర్‌లో ‘కొహెరెంట్‌ ఐసింగ్‌ మెషీన్‌’ (సీఐఎం)ను ఏర్పాటు చేయనున్నారు.
దీన్ని సెమీ క్వాంటమ్‌ కంప్యూటర్‌గా పరిగణించవచ్చు. సంప్రదాయ కంప్యూటర్లతో పరిష్కరించడం కష్టమైన అనేక సంక్లిష్ట సమస్యలను సీఐఎం వేగంగా పరిష్కరించగలదు.సంప్రదాయ కంప్యూటింగ్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సాంకేతికతల మధ్య హైబ్రిడ్‌ రూపంగా దీన్ని చెప్పొచ్చు. ఫోటాన్ల సమూహం సృష్టించే ఎలక్ట్రిక్‌ ఫీల్డ్‌ ఆధారంగా ఈ యంత్రం పనిచేస్తుంది.

మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం
సాధారణ క్వాంటమ్‌ కంప్యూటర్లు పనిచేయడానికి అత్యంత తక్కువ, అంటే మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం.అందుకు భిన్నంగా సీఐఎం సాధారణ గది ఉష్ణోగ్రతలోనే పనిచేయడం దీని ప్రత్యేకత. బెంగళూరుకు చెందిన ‘కాన్‌ఫ్లుయెన్స్‌’ స్టార్టప్‌ ఈ సాంకేతికతను అభివృద్ధి చేసింది.అమెరికాకు చెందిన ‘అరోహక్‌’ సంస్థ సహకారంతో సోమవారం స్టేట్‌ డేటా సెంటర్‌లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.ఈ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి సుమారు రూ.2 కోట్ల వ్యయం అవుతుంది.

డ్రగ్‌ డిస్కవరీ నుంచి రూట్‌ ప్లానింగ్‌ వరకు..
సీఐఎం ద్వారా వివిధ రంగాల్లో ఎదురయ్యే ఆప్టిమైజేషన్‌ సమస్యలకు పరిష్కారాలు కనుగొనే అవకాశం ఉంటుంది.కొత్త ఔషధాల అభివృద్ధికి సంబంధించిన పరిశోధనలు, కృత్రిమ మేధస్సు (ఏఐ),మెషీన్‌ లెర్నింగ్‌, లాజిస్టిక్స్‌,సప్లైచైన్‌ ఆప్టిమైజేషన్‌,ఆర్థిక నమూనాల రూపకల్పన (ఫైనాన్షియల్‌ మోడలింగ్‌), మెటీరియల్‌ సైన్సెస్‌, రూట్‌ ప్లానింగ్‌ వంటి అనేక రంగాల్లో దీన్ని ఉపయోగించవచ్చు.వివిధ సంస్థలతో పాటు ‘అమరావతి క్వాంటమ్‌ అండ్‌ ఏఐ ఇన్నోవేషన్‌ సెంటర్‌’ (ఏక్యూఐసీ)లో భాగస్వాములుగా ఉన్న రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల ప్రొఫెసర్లకు కూడా సీఐఎంను వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు.’అమరావతి క్వాంటమ్‌ మిషన్‌’ ఆధ్వర్యంలో ఏక్యూఐసీకి చెందిన ప్రొఫెసర్లు ప్రస్తుతం 100 యూజ్‌ కేసులకు సంబంధించిన అల్గారిథమ్‌లపై పని చేస్తున్నారు.వీటిని సీఐఎంపై అమలు చేసి పరీక్షించే అవకాశం ఇకపై అందుబాటులోకి రానుంది.

అంబులెన్స్‌ సేవలపై పైలట్‌ ప్రాజెక్టు
రాష్ట్రంలో 108 అంబులెన్స్‌ సేవలను మరింత వేగంగా, సమర్థంగా అందించేందుకు క్వాంటమ్‌ మిషన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టారు.తొలిదశలో గుంటూరు జిల్లాలో 67 అంబులెన్స్‌లతో పైలట్‌ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.ఈ ప్రాజెక్టుపై నాలుగు స్టార్టప్‌ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి.ఈ ప్రాజెక్టుకు రూపొందించే అల్గారిథమ్‌ను అమలు చేసేందుకు తాజాగా ఏర్పాటు చేయనున్న సీఐఎంను వినియోగించనున్నారు.ప్రస్తుతం 108 అంబులెన్స్‌లను జిల్లా, మండల కేంద్రాల్లోని ఆసుపత్రుల వద్ద అందుబాటులో ఉంచుతున్నారు.ప్రమాదం లేదా అత్యవసర పరిస్థితికి సంబంధించి ఫోన్‌ వచ్చిన తర్వాతే అవి సంఘటనా స్థలానికి బయలుదేరుతున్నాయి.ఇకపై ఈ విధానాన్ని మరింత సమర్థంగా మార్చేందుకు కొత్త అల్గారిథమ్‌ను రూపొందిస్తున్నారు.

గత మూడేళ్లలో ఏయే ప్రాంతాల నుంచి ఎక్కువగా అత్యవసర కాల్స్‌ వచ్చాయన్న సమాచారాన్ని విశ్లేషించి, అవసరం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ముందుగానే అంబులెన్స్‌లను మోహరించేలా వ్యవస్థను రూపొందించనున్నారు.అలాగే అత్యవసర పరిస్థితిలో సమీపంలోని ఏ ఆసుపత్రికి ఏ మార్గం ద్వారా వెళితే వేగంగా చేరుకోవచ్చో డ్రైవర్‌కు సూచించే విధానాన్ని కూడా ఇందులో అభివృద్ధి చేస్తారు.అంబులెన్స్‌ ప్రయాణం ప్రారంభమైన తర్వాత మార్గంలో ఎక్కడ ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంది,ప్రత్యామ్నాయంగా ఏ దారి తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేర్చగలదన్న సమాచారాన్ని అందించేందుకు ఈ వ్యవస్థను గూగుల్‌ మ్యాప్స్‌తో అనుసంధానించనున్నారు.

దీంతో పరిస్థితులకు అనుగుణంగా వేగవంతమైన మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది.అంబులెన్స్‌ సేవల ప్రాజెక్టుతో పాటు వివిధ ప్రభుత్వ, ఇతర విభాగాలకు సంబంధించి మరో 24 యూజ్‌ కేసులను కూడా గుర్తించినట్లు అమరావతి క్వాంటమ్‌ మిషన్‌ డైరెక్టర్‌ సీవీ శ్రీధర్‌ తెలిపారు.ఆయా యూజ్‌ కేసులకు సంబంధించిన అప్లికేషన్లను అమలు చేసి పరీక్షించేందుకు కొత్తగా ఏర్పాటు చేస్తున్న సీఐఎం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు