అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ముస్లిం దేశాలన్నీ ఐక్యంగా నిలబడాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీ పిలుపునిచ్చారు. ఈ రెండు దేశాలే ఇస్లామిక్ దేశాలన్నింటికీ ఉమ్మడి శత్రువులని ఆయన అభివర్ణించారు. ముస్లిం దేశాల పాలకులు తమ నిజమైన శత్రువు ఎవరో తెలుసుకోవాలని, వారి ప్రణాళికలను అర్థం చేసుకుని ఎదుర్కోవాలని హితవు పలికినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ‘ఐఆర్ఎన్ఏ’ వెల్లడించింది.
టెహ్రాన్‌లో జరిగిన మత పెద్దల సదస్సుకు పంపిన ఒక లేఖలో ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల క్రితం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఖమేనీ తండ్రితో పాటు పలువురు సీనియర్ నేతలు మరణించారు. అప్పటి నుంచి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. 6 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన నుంచి ఈ సందేశం వెలువడటం గమనార్హం.
ఈ యుద్ధం ముస్లిం ప్రపంచంలో విభేదాలను బహిర్గతం చేసింది. పొరుగున ఉన్న గల్ఫ్ అరబ్ దేశాల్లోని లక్ష్యాలపై ఇరాన్ దాడులు చేయడం, హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలను నియంత్రించడం వంటి చర్యలు ఈ చీలికలకు కారణమయ్యాయి. ఈ ప్రాంతంలో అమెరికా సైనిక ఉనికిని టెహ్రాన్ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.


