పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి.వ్యూహాత్మకంగా కీలకమైన హర్ముజ్ జలసంధిలోని ఇరాన్ లారక్ దీవిపై అమెరికా బలగాలు దాడి చేశాయి.దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా అమెరికా బలగాలపై క్షిపణి దాడులు చేపట్టింది.లారక్ దీవిలో ఇరాన్‌కు చెందిన రాకెట్ లాంచర్లను అమెరికా ధ్వంసం చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) రంగంలోకి దిగింది.
జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించింది. దీంతో ఇరుదేశాల మధ్య ఘర్షణ మరోసారి ఉధృతమైంది.
లారక్‌లో రెండు లాంచర్ వ్యవస్థలే లక్ష్యం
హర్ముజ్ జలసంధిలో ఉన్న లారక్ దీవిపై అమెరికా బలగాలు రెండు ఇరానియన్ లాంచర్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి.ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌కు చెందిన సిబ్బంది సముద్రంలో నౌకా విధ్వంసక మైన్లను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు గుర్తించడంతో ఈ దాడి చేసినట్లు అమెరికా వెల్లడించింది.జూలై చివరి తర్వాత ఇరాన్ భూభాగంపై అమెరికా చేపట్టిన తొలి దాడి ఇదేనని తెలుస్తోంది.అమెరికా అధికారుల ప్రకారం.. లారక్‌లోని లాంచర్లు హర్ముజ్ జలసంధిలో మైన్లను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి.ఈ కీలక జలమార్గంలో మైన్లను అమర్చితే అంతర్జాతీయ నౌకాయానానికి భారీ ముప్పు ఏర్పడే అవకాశం ఉంది.ఈ ప్రమాదాన్ని ముందుగానే అడ్డుకునేందుకే లాంచర్లపై దాడి చేసినట్లు వాషింగ్టన్ పేర్కొంది.
‘ప్రతీకారం తప్పదు’.. ఇరాన్ హెచ్చరిక
లారక్ దీవిపై అమెరికా దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది.ఈ ఘటనలో తమ సైనిక సిబ్బందితో పాటు పౌరులు కూడా మరణించారని, మరికొందరు గాయపడ్డారని వెల్లడించింది.అమెరికా చర్యకు తప్పకుండా ప్రతిస్పందిస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హెచ్చరించింది.అమెరికా దాడికి కేవలం సమాధానం ఇవ్వడమే కాకుండా శిక్ష కూడా ఉంటుందని స్పష్టం చేసింది.
అమెరికా స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులు
తమ హెచ్చరికకు అనుగుణంగానే ఇరాన్ ప్రతిదాడికి దిగింది.జోర్డాన్‌లో అమెరికా బలగాలు ఉన్న కింగ్ హుస్సేన్, అల్ అజ్రాక్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు IRGC ప్రకటించింది.ఈ దాడిలో రెండు స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.
8 క్షిపణులను అడ్డుకున్న జోర్డాన్
ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను తమ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు జోర్డాన్ ప్రకటించింది. మొత్తం ఎనిమిది క్షిపణులను గగనతలంలోనే కూల్చివేసినట్లు తెలిపింది.దీంతో అమెరికా-ఇరాన్ ఘర్షణ ప్రభావం ఇరుదేశాలకే పరిమితం కాకుండా పశ్చిమాసియాలోని ఇతర దేశాలపైనా పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
హర్ముజ్ జలసంధే కీలక కేంద్రం
తాజా పరిణామాలకు హర్ముజ్ జలసంధి ప్రధాన కేంద్రంగా మారింది.ఇరాన్‌కు చెందిన లారక్ దీవి హార్ముజ్ దీవికి దక్షిణంగా,ఖేష్మ్ దీవికి తూర్పున ఉంది. దాదాపు 49చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ దీవి.. కీలకమైన సముద్ర మార్గానికి సమీపంలో ఉండటంతో వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది.లారక్‌లో IRGC నేవీ స్థావరం కూడా ఉంది. ప్రపంచ ఇంధన సరఫరాలో హర్ముజ్ జలసంధికి కీలక పాత్ర ఉంది.
ఒమన్ వైపు మళ్లిన నౌకలు
ప్రపంచ చమురు, ద్రవీకృత సహజవాయువు (LNG) రవాణాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండానే జరుగుతుంది.అందుకే హర్ముజ్‌లో మైన్లు ఏర్పాటు చేసేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలను అమెరికా అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది.హర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడుల నేపథ్యంలో కొన్ని నౌకలు తమ ప్రయాణ మార్గాలను మార్చుకున్నాయి.ఒమన్ తీరానికి సమీపంలోని దక్షిణ మార్గం గుండా అవి ప్రయాణిస్తున్నాయి.అయితే ఆ ప్రాంతంలోనూ ఇరాన్ మైన్లు ఏర్పాటు చేయగలిగితే అంతర్జాతీయ నౌకాయానానికి మరింత ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని అమెరికా రక్షణ రంగ మాజీ అధికారి డేవిడ్ డెస్ రోచెస్ విశ్లేషించారు.
ట్రంప్ ‘జీరో టాలరెన్స్’ హెచ్చరిక
హర్ముజ్ జలసంధిలో మైన్లు ఏర్పాటు చేసే ప్రయత్నాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే తీవ్రంగా హెచ్చరించారు.మైన్లు అమర్చే ఏ నౌక లేదా పడవనైనా క్రమపద్ధతిలో ధ్వంసం చేస్తామని ఆయన హెచ్చరించినట్లు సమాచారం.హర్ముజ్‌లో మైన్ల ఏర్పాటుపై అమెరికా ‘జీరో టాలరెన్స్’విధానాన్ని అనుసరిస్తోందని ట్రంప్ స్పష్టం చేశారు.
చమురు ధరలకు సెగ.. పెరిగిన మార్కెట్ ఆందోళన
లారక్ దీవిపై అమెరికా దాడి చేసినట్లు వార్తలు వెలువడటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన పెరిగింది.ఫలితంగా చమురు ధరలు రెండు శాతానికి పైగా పెరిగాయి. హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు మరింత అంతరాయం ఏర్పడితే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది.దీంతో అంతర్జాతీయ మార్కెట్లు తాజా పరిణామాలపై అప్రమత్తంగా ఉన్నాయి.
మళ్లీ ప్రత్యక్ష సైనిక ఘర్షణ దిశగా..
అమెరికా-ఇరాన్ మధ్య తాజాగా చోటుచేసుకున్న దాడులు ఇరుదేశాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న ఘర్షణను మరింత ప్రమాదకర దశలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది.హర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాయానం సురక్షితంగా కొనసాగేందుకు అమెరికా ప్రయత్నిస్తుండగా.. ఈ కీలక సముద్ర మార్గంపై తన ప్రభావాన్ని కొనసాగించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది.లారక్ దీవిపై అమెరికా దాడి, దానికి ప్రతీకారంగా జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడం.. ఇరుదేశాల మధ్య పోరు మరోసారి నేరుగా సైనిక ఘర్షణగా మారుతున్న సంకేతాలను ఇస్తోంది.


