Homeఅంతర్జాతీయంఅంతకంతకూ పెరుగుతున్న మృతులు

అంతకంతకూ పెరుగుతున్న మృతులు

- Advertisement -

903కు చేరిన సంఖ్య… సామూహిక ఖననాలు
నేపాల్ జల ప్రళయంలో 4,247 మంది గల్లంతు

కాటˆండు: నేపాల్‌లో ప్రకృతి సృష్టించిన తీవ్ర విషాదం కొనసాగుతోంది. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో హిమానీనదం, మంచు, రాళ్లు విరిగిపడటంతో ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదలు ఉత్తర, మధ్య నేపాల్‌లో భారీ విధ్వంసం సృష్టించాయి. ఆరు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతుండగా… మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా అధికారిక లెక్కల ప్రకారం 903 మంది మృతిచెందగా.. మరో 4,247 మంది గల్లంతయ్యారు. వరదలు, కొండచరియల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ఎనిమిది జిల్లాల్లో మృతదేహాలను వెలికితీశారు. చిత్వన్లో అత్యధికంగా 272, నావల్పరాసి ఈస్ట్‌లో 207, నావల్పరాసి వెస్ట్‌లో 151, నువాకోట్‌లో 95, గోర్ఖాలో 62, ధాదింగ్‌లో 55, తనహున్లో 37, రసువాలో 24 మృతదేహాలు లభించాయి. గల్లంతైన వారిలో 85 మంది భద్రతా సిబ్బంది, 320 మంది విదేశీయులు ఉన్నారు.
20 వేల మందితో సహాయక చర్యలు
సహాయక చర్యల కోసం నేపాల్ ప్రభుత్వం సుమారు 20 వేల మంది భద్రతా సిబ్బంది, 14 సైనిక హెలికాప్టర్లను రంగంలోకి దించింది. ఆరు ప్రత్యేక వైద్య బృందాలు సేవలు అందిస్తున్నాయి. అయితే భారీ వర్షాలు, కొండచరియలు, దెబ్బతిన్న రహదారులు సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి. వరదలకు 25 మైళ్లకు పైగా రహదారులు, 40 వంతెనలు దెబ్బతిన్నాయి.
టన్నెల్లో 100 మంది కార్మికులు?
త్రిశూలీ-3ఏ జలవిద్యుత్ కేంద్రం టన్నెల్ వద్ద సుమారు 100 మంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. వారిని రక్షించేందుకు నేపాల్ బృందాలతో పాటు భారత ప్రత్యేక టన్నెల్ రెస్క్యూ బృందం, సాంకేతిక నిపుణులు సహకరిస్తున్నారు. మరోవైపు టిబెట్‌లో ఏర్పడిన తాత్కాలిక సరస్సు కారణంగా మరోసారి వరదలు వచ్చే ప్రమాదంపై అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
గుర్తుపట్టలేని మృతదేహాలకు తాత్కాలిక ఖననం
వరదల్లో కొట్టుకొచ్చిన వందలాది మృతదేహాలు కుళ్లిపోవడంతో గుర్తించడం కష్టంగా మారింది. ఆసుపత్రులు, మార్చురీల్లో స్థలం లేకపోవడం, అంటువ్యాధుల ముప్పు నేపథ్యంలో సుమారు 100 మృతదేహాల నుంచి డీఎన్‌ఏ నమూనాలు, ఫొటోలు, ఇతర గుర్తింపు వివరాలను సేకరించి తాత్కాలికంగా పూడ్చిపెట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా మృతదేహాలను ఖననం చేయడంపై ప్రజాసంఘాలు, బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై అధికారులు స్పందిస్తూ.. ఇది శాశ్వత ఖననం కాదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మానవతా ప్రమాణాలు, రెడ్క్రాస్ మార్గదర్శకాల మేరకే తాత్కాలికంగా పూడ్చిపెట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో డీఎన్‌ఏ లేదా ఇతర ఆధారాలతో మృతులను గుర్తించిన వారి కుటుంబాలకు మృతదేహాలను అప్పగిస్తామని వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు