నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతకు సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. వారిపై వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టులను (ఎఫ్ఐఆర్‌లు) రద్దు చేస్తూ మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తమకున్న ప్రత్యేక అధికారాలను వినియోగించి సర్వోన్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఁఈ ఎఫ్ఐఆర్‌లపై ఎలాంటి దర్యాప్తు జరపరాదని, అన్ని రకాలుగా వాటిని మూసివేయాలనిఁ ధర్మాసనం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. విద్యార్థుల భవిష్యత్తు, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేసులను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టును అభ్యర్థించాయి. వారి విజ్ఞప్తిని అంగీకరించిన సుప్రీంకోర్టు, ఈ నిరసనలకు సంబంధించి కొత్తగా ఎలాంటి ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయరాదని కూడా ఆదేశించింది.నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జులై 20 నుంచి 25 మధ్య ఢిల్లీలోని జంతర్ మంతర్ కేంద్రంగా, అలాగే మహారాష్ట్ర, బిహార్, అసోం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో నిరసనలు జరిగాయి. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో కొంతమంది పోలీసులు గాయపడ్డారు. అయితే, ఢిల్లీ పోలీసులు గుర్తించిన సుమారు 2,873 మందిపై ఈ ఆదేశాలు వర్తించవని కోర్టు స్పష్టం చేసింది. తీవ్రమైన నేర చరిత్ర ఉన్న వీరి పాత్రపై, ఆస్తి నష్టం లేదా శారీరక దాడుల వంటి ఘటనల్లో పరిమితమైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపవచ్చని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే, సెప్టెంబర్ 5న ఢిల్లీలో తలపెట్టిన తమ నిరసన కార్యక్రమాన్ని విరమించుకుంటున్నట్లు సీజేపీ ప్రకటించింది.
ఏమిటీ ఆర్టికల్ 142?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 142, తన ముందున్న ఏదైనా కేసులో ఃసంపూర్ణ న్యాయంః చేయడానికి అవసరమైన ఎలాంటి ఆదేశాలనైనా జారీ చేసే ప్రత్యేక అధికారాన్ని సుప్రీంకోర్టుకు కల్పిస్తుంది. గతంలో చారిత్రాత్మక అయోధ్య (రామజన్మభూమి-బాబ్రీ మసీదు) తీర్పులోనూ సుప్రీంకోర్టు ఇదే ఆర్టికల్‌ను ప్రయోగించింది. వివాదాస్పద స్థలాన్ని రామ్ లల్లాకు కేటాయించినప్పటికీ, 1992లో మసీదు కూల్చివేతను ఁచట్టాన్ని అతిక్రమించిన ఘోరమైన చర్యఁగా పేర్కొంది. ఈ క్రమంలో జరిగిన తప్పును సరిదిద్దేందుకు, ఆర్టికల్ 142ను ఉపయోగించి అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించింది. భోపాల్ గ్యాస్ దుర్ఘటన కేసు, విడాకులు మంజూరు చేయడం వంటి ఇతర కీలక కేసుల్లోనూ ఈ అధికారాన్ని వినియోగించారు. అసాధారణ పరిస్థితుల్లో సంపూర్ణ న్యాయం కోసం మాత్రమే ఈ అధికారాన్ని ఆచితూచి వాడాలని న్యాయస్థానాలు పలుమార్లు స్పష్టం చేశాయి.


