Homeఅంతర్జాతీయంనేపాల్‌ వరదల్లో 1,204 మృతదేహాలు.. 4,216 మంది ఆచూకీ గల్లంతు

నేపాల్‌ వరదల్లో 1,204 మృతదేహాలు.. 4,216 మంది ఆచూకీ గల్లంతు

- Advertisement -

నేపాల్‌లో సంభవించిన భారీ ప్రకృతి విపత్తుకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని ఆ దేశ ప్రధాని బాలేంద్ర షా స్పష్టం చేశారు.
వరదలు, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక, అన్వేషణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ చర్యలు ముందుకు సాగుతున్న కొద్దీ మృతదేహాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు 1,204 మృతదేహాలను గుర్తించారు. మరో 4,216 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. భద్రతా సిబ్బంది ఇప్పటివరకు 11,993 మందిని ప్రమాద ప్రాంతాల నుంచి తరలించి సురక్షిత ప్రదేశాలకు చేర్చారు.
ఇదే విపత్తు ప్రభావంతో టిబెట్‌లో మృతుల సంఖ్య 21కి చేరింది.

ప్రపంచ దేశాలదే బాధ్యత: బాలేంద్ర షా
మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పలు నదులు ప్రమాదకర స్థాయిని దాటాయి. సింధూలి జిల్లాలోని సన్‌ కోశీ, గూర్ఖా జిల్లాలోని బుద్ధి గండకీ, దాదెల్‌ధుర జిల్లాలోని మహాకాలి నదులు బుధవారం ప్రమాదకర స్థాయిలో ప్రవహించినట్లు నేపాల్‌ వాతావరణశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాల్లో 1,113 మందికి పోస్టుమార్టం, న్యాయపరమైన ప్రక్రియలను పూర్తి చేసినట్లు నేపాల్‌ పోలీసులు తెలిపారు. భోటే కోశీ నది వరదల కారణంగా ఏర్పడిన విపత్తు వెనుక వాతావరణ మార్పుల ప్రభావం ఉందని ప్రధాని బాలేంద్ర షా పేర్కొన్నారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు దానిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు.

బుధవారం ప్రతినిధుల సభలో మాట్లాడిన షా.. వాతావరణ మార్పులకు ప్రపంచ దేశాలే ప్రధాన కారణమవుతున్నందున, వాటి నియంత్రణలోనూ ఆయా దేశాలకు బాధ్యత ఉంటుందని స్పష్టం చేశారు. నేపాల్‌ ఎదుర్కొంటున్న విపత్తు సమయంలో భారత్, పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, అమెరికా, ఆస్ట్రేలియా, ఖతార్, స్విట్జర్లాండ్, బ్రిటన్, జపాన్, సింగపూర్‌ వంటి దేశాలు సహాయాన్ని అందిస్తున్నాయని బాలేంద్ర షా తెలిపారు.ఇదిలా ఉండగా.. నేపాల్‌లో ఏర్పడిన వరద విపత్తుకు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇంజినీరింగ్‌ కార్యకలాపాలు కూడా కారణమై ఉండొచ్చని పర్యావరణవేత్త సునీతా నారాయణన్‌ అభిప్రాయపడ్డారు.

భారత సంతతివారి కోసం ప్రత్యేక అన్వేషణ
నేపాల్‌ వరదల్లో అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన నలుగురు భారత సంతతి వ్యక్తులు గల్లంతైనట్లు సేవా ఇంటర్నేషనల్‌ యూఎస్‌ఏ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది.వారి ఆచూకీ కోసం లక్ష డాలర్ల నిధిని విడుదల చేసినట్లు తెలిపింది.దీపక్‌ అహూజా (60), మధు అహూజా (57), అర్చనా సురేశ్, రఘు రాజన్‌ కోసం ఈ నిధులను అన్వేషణ చర్యలకు వినియోగించనున్నట్లు సంస్థ అధ్యక్షుడు శ్రీకాంత్‌ గుండవరపు తెలిపారు.

నేపాల్‌కు భారత్‌ మరింత సాయం
నేపాల్‌లో సహాయక చర్యలకు భారత్‌ తన మద్దతును కొనసాగిస్తోంది. బుధవారం మరో 5 టన్నుల ఔషధాలను నేపాల్‌కు పంపించింది.వీటితో పాటు ప్రత్యేక పరికరాలు, 11 మంది నిపుణులతో కూడిన ఐదో విమానం కూడా నేపాల్‌కు బయలుదేరింది.ఇప్పటివరకు 166 మంది భారతీయులను సహాయక సిబ్బంది సురక్షితంగా రక్షించినట్లు సమాచారం.ఇక టిబెట్‌కు వెళ్లిన 410 మంది భారతీయ యాత్రికులు బుధవారం స్వదేశంలోని తమ ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు.మరోవైపు మంగళవారమే సహాయక సామగ్రితో కాఠ్‌మాండూకు చేరుకున్న నటుడు సోనూ సూద్‌.. తమ ఫౌండేషన్‌ ద్వారా రాబోయే కొన్ని నెలల పాటు బాధితులకు సహాయం కొనసాగిస్తామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు