న్యూఢిల్లీ: తమిళనాడులోని రెండు, పుదుచ్చేరిలో ఒక అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) షెడ్యూల్ విడుదý చేసింది. ఈ మూడు స్థానాలతో పాటు పశ్చిమ బెంగాల్‌లో రెండు స్థానాలకు అక్టోబర్ 6న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం సీఈసీ ప్రకటన చేసింది. తమిళనాడులో మధురాంతకం, ధారాపురం స్థానాలతో పాటు పుదుచ్చేరిలో తట్టాంచావడి నియోజకవర్గానికి అక్టోబర్ 6న ఉప ఎన్నిక జరగగా… 9న ఫలితాలు వెలువడనున్నాయి. సెప్టెంబర్ 9న నోటిఫికేషన్ విడుదలై… అదే రోజు నుంచి 16 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 17న నామినేషన్ల పరిశీలన… 19న ఉపసంహరణకు తుది గడువుగా సీఈసీ షెడ్యూల్‌లో పేర్కొంది. మధురాంతకం, ధారాపురం స్థానాలు ఎమ్మెల్యేల రాజీనామాలతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. 2026 ఎన్నికల్లో ఈ రెండు స్థానాల్లో ఏఐఏడీఎంకే విజయం సాధించింది. రెండు స్థానాల్లో గెలిచిన పుదుచ్చేరి సీఎం రంగస్వామి మంగళం స్థానాన్ని కొనసాగిస్తూ తట్టాంచావడి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. అలానే తమిళనాడులో మరో ఐదు స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉండగా… వాటి గురించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రస్తావించలేదు. తిరుచ్చి ఈస్ట్, పెరుందురై, అంబాసముద్రం, విరాలిమలై, కరూర్ స్థానాలపై కోర్టు కేసులు ఉండటంతో వీటి ఉపఎన్నికల ఆలస్యం కానుంది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయాలను సవాల్ చేస్తూ కోర్టుల్లో పిటిషన్లు వెయ్యడం, ఆ కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఉప ఎన్నికలకు బ్రేక్ పడింది.


