Homeతెలంగాణఎర్రవల్లిలో తీవ్ర ఉద్రిక్తత

ఎర్రవల్లిలో తీవ్ర ఉద్రిక్తత

- Advertisement -
  • కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణుల యత్నం
  • ఎర్రవల్లికి బయల్దేరిన కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్ నేతల అరెస్ట్

విశాలాంధ్ర-హైదరాబాద్: సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద డప్పుల మోతకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వచ్చి డప్పులు మోగిస్తూ నిరసన తెలిపేందుకు ప్రయత్నిం చారు. నర్సారెడ్డి ఆధ్వర్యంలో వరదరాజపూర్ మీదుగా కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకెళ్లారు. ఎక్కిడికకక్కడ కాంగ్రెస్ శ్రేణులను బారికేడ్లు, రోప్ పార్టీతో పోలీసులు నిలువరించారు. దీంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు కార్యకర్తలు బారికేడ్లను తోసుకుని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు అర కిలోమీటరు దగ్గర్లోకి వెళ్లి డప్పుల మోతతో నిరసన తెలిపారు. పోలీసులు స్పందించి వెంటనే నిరసనకారులను వెనక్కి తీసుకొచ్చారు. ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ఒక దశలో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్ష±రెడ్డి బారికేడ్లు తోసుకుని ఫాంహౌస్ వైపునకు పరుగులు తీశారు. మరో వైపు ఫాంహౌస్ సమీపంలో రైతు దీక్ష పేరుతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఉదయం నుంచి ఎర్రవల్లి పరిసరాల్లో ఉద్రిక్తత ఏర్పడింది.
ఎర్రవల్లికి బయల్దేరిన కేటీఆర్, హరీశ్‌రావు అరెస్ట్
ఫామ్‌హౌస్ వద్ద పరిణామాలతో కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి ఎర్రవల్లికి బయల్దేరారు. బొల్లారం వద్ద వీరిని పోలీసులు అడ్డుకున్నారు. హకీంపేట వద్ద కేటీఆర్, హరీశ్‌రావును నిలిపివేశారు. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ శ్రేణులను కేసీఆర్ ఇంటిపైకి తీసుకుపోవాలని సూచనలు ఉన్నాయా అని పోలీసులను కేటీఆర్ ప్రశ్నించారు. పోలీసులు దగ్గరుండి కాంగ్రెస్ గుండాలను, నగర బహిష్కరణ చేసిన రౌడీలను, కేసీఆర్ ఫామ్ హౌస్ మీదకి పంపుతున్నారని…కానీ మా ఇంటికి నేను వెళ్తే నాతో పాటు మా పార్టీ నాయకులను ఆపుతున్నారని మండిపడ్డారు. పోలీసులే దగ్గరుండి కేసీఆర్ ఇంటిపైన దాడికి తోవ చూపిస్తున్నారని ఆరోపించారు. బారికేట్లు పెట్టి మరి కాంగ్రెస్ గుండాలను పంపుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఇంటి వైపు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని, వందల మంది బలగాలు అక్కడ ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే ఎస్కార్ట్, రోప్ పార్టీలను ఇచ్చి తీసుకుపోతున్నారని కేటీఆర్ వీడియో చూపించారు. మీపై నమ్మకం లేదు.. మా నాయకుడిని మేమే కాపాడుకోవాలి అంటూ కేటీఆర్ ముందుకు సాగారు. కాంగ్రెస్ వారిని కూడా అటువైపు వెళ్లకుండా పోలీసులు ఆపాలని సూచించారు. అనంతరం కేటీఆర్, హరీశ్‌రావు.. బొల్లారం చౌరస్తా నుంచి ఎర్రవల్లికి పాదయాత్రగా బయల్దేరారు. దీంతో కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి జవహర్‌నగర్, బోయిన్పల్లి పీఎస్లకు తరలించారు.
బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ వద్ద రణరంగం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పోలీసులు బోయిన్పల్లి పీఎస్‌కు తరలించగా… బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని స్టేషన్ ఎదుట బైఠాయించారు.అరెస్ట్ చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కొద్దిసేపటికి వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో కొందరు కార్యకర్తలు కుర్చీలు, రాళ్లు విసురుకు న్నారు. ఈ ఘటనలో ఇరుపక్షాలకు చెందిన కొందరు గాయపడినట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించారు. అతి కష్టం మీద ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు. ఈ ఘటనల నేపథ్యంలో బోయిన్పల్లి, జవహర్‌నగర్ సహా బీఆర్‌ఎస్ నేతలను తరలించిన పోలీస్ స్టేషన్‌ల పరిసరాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. తమ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీఆర్‌ఎస్ తీవ్రంగా తప్పుపట్టింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న తమ నేతలకు కూడా రక్షణ లేకుండా పోయిందని బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా: హరీశ్ రావు
అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. నిన్నటికి నిన్న మహిళా ఎమ్మెల్యేల గొంతులు పిసికి, చీరలు లాగిన కాంగ్రెస్ ప్రభుత్వం… ఈరోజు తెలంగాణ సాధించిన నాయకుడు, పదేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసిన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇంటిపైకే దాడికి పంపిందని మండి పడ్డారు. స్వయంగా హోంమంత్రి శాఖను కూడా తన చేతి లోనే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే దగ్గరుండి ఈ దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. ‘మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ అప్రజాస్వామిక చర్యలను, దాడులను నువ్వు సమర్థి స్తావా? మీరు ప్రజలకు ఇచ్చిన ఏడవ గ్యారెంటీ ఇదేనా’ అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ‘నీకు నిజంగా రాజ్యాం గం మీద నమ్మకం ఉంటే, నువ్వు మాట్లాడే మాటల్లో కొద్దిగా నిజాయితీ ఉన్నా తక్షణమే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్… కేసీఆర్ చావాలి, కేసీఆర్ చావును మేం కోరుకుం టున్నాం అని పబ్లిక్‌గా అన్నాడంటే…అది శంకర్ మాట కాదు, ముమ్మాటికీ రేవంత్ రెడ్డి మాటే అన్నారు. రేవంత్ రెడ్డి ప్రతిరోజూ కేసీఆర్ చావును కోరుకుంటున్నాడని, తన ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ని తిట్టిస్తున్నాడు, దాడులు చేయిస్తున్నాడని విమర్శించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు