Homeఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్‌లో సీ ప్లేన్లకు గ్రీన్‌సిగ్నల్‌.. పది ప్రాంతాల్లో వాటర్‌డ్రోమ్‌లు

ఆంధ్రప్రదేశ్‌లో సీ ప్లేన్లకు గ్రీన్‌సిగ్నల్‌.. పది ప్రాంతాల్లో వాటర్‌డ్రోమ్‌లు

- Advertisement -

సాహస పర్యాటకానికి మరింత ఊతమిచ్చేలా ఆంధ్రప్రదేశ్‌లో సీ ప్లేన్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
వీటిని నిర్వహించేందుకు స్కైహోప్‌ ఏవియేషన్, మారిటైం ఎనర్జీ హెలి ఎయిర్‌ సర్వీసెస్‌ (మె హెయిర్‌) సంస్థలు ముందుకొచ్చాయి.
ఈ రెండు సంస్థలు సమర్పించిన ప్రతిపాదనలకు కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో సీ ప్లేన్లను నడిపేందుకు ఎంపిక చేసిన ప్రాంతాలను ఆయా సంస్థల ప్రతినిధులు త్వరలో క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.

పది ప్రాంతాల్లో వాటర్‌డ్రోమ్‌లు
రాష్ట్రంలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పది ప్రాంతాల్లో సీ ప్లేన్‌ సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ బెర్మ్‌ పార్కు నుంచి శ్రీశైలం వరకు గతేడాది నిర్వహించిన ట్రయల్‌ రన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీ ప్లేన్‌లో శ్రీశైలం వరకు ప్రయాణించిన విషయం తెలిసిందే. విజయవాడతో పాటు శ్రీశైలం, తిరుపతి పరిధిలోని రాయలచెరువు, సూర్యలంక, గండికోట, కాకినాడ, విశాఖపట్నం, అరకు పరిధిలోని జోలాపుట్‌, లంబసింగి సమీపంలోని తాజంగి రిజర్వాయర్‌, పోలవరం ప్రాంతాల్లో సీ ప్లేన్ల నిర్వహణకు వాటర్‌డ్రోమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వీటి నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) త్వరలో టెండర్లు పిలవనుంది.

డిమాండ్‌ మేరకు దశలవారీగా సేవలు
ఒక్కో వాటర్‌డ్రోమ్‌ నిర్మాణానికి రూ.20 కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నారు. ఈ పది ప్రాంతాల్లో మినీ విమానాశ్రయాలను కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీ ప్లేన్‌ ఆపరేటర్లు ముందుకు రావడంతో వాటర్‌డ్రోమ్‌ల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పది ప్రాంతాల్లో ఒకేసారి సీ ప్లేన్‌ సేవలు ప్రారంభించకుండా.. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలిదశలో విజయవాడ, శ్రీశైలం, విశాఖపట్నం, లంబసింగి, సూర్యలంక, కాకినాడ ప్రాంతాల్లో సేవలు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ మార్గాల్లో ప్రయాణికుల డిమాండ్‌ పెరిగే వరకు సీ ప్లేన్‌ ఆపరేటర్లకు కేంద్ర ప్రభుత్వం ఉడాన్‌ పథకం కింద లోటు భర్తీ నిధి (వీజీఎఫ్‌) ద్వారా ఆర్థిక సహకారం అందించనుంది.

బోట్ల కోసం కూడా వాటర్‌డ్రోమ్‌లు
రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నందున సీ ప్లేన్లకు మంచి ఆదరణ లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.వాటర్‌డ్రోమ్‌లను కేవలం సీ ప్లేన్లకే పరిమితం చేయకుండా పర్యాటక బోట్ల అవసరాలకు కూడా ఉపయోగపడేలా రూపొందిస్తున్నారు. విజయవాడ, దిండి, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ తదితర ప్రాంతాల్లో ఏపీటీడీసీ ఇప్పటికే పర్యాటక బోట్లను నిర్వహిస్తోంది. అంతేకాకుండా ప్రైవేట్‌ సంస్థలు హౌస్‌బోట్లను నడిపేందుకు కూడా ఇటీవల ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో భవిష్యత్తులో వాటర్‌డ్రోమ్‌లు పలు రకాల జల పర్యాటక కార్యకలాపాలకు ఉపయోగపడనున్నాయి.

కేరళ, గుజరాత్‌లో ఇప్పటికే ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉడాన్‌ పథకంలో భాగంగా దేశంలో తొలిసారిగా కేరళ, గుజరాత్‌ రాష్ట్రాల్లో సీ ప్లేన్‌ సేవలు కొద్దినెలల క్రితమే ప్రారంభమయ్యాయి. కేరళలో కొచ్చి నుంచి మున్నార్‌ వరకు 17 సీట్ల సామర్థ్యం ఉన్న సీ ప్లేన్‌ నడుస్తోంది. గుజరాత్‌లో అహ్మదాబాద్‌లోని సబర్మతి నది తీరం నుంచి కెవాడియా వరకు రెండు సీ ప్లేన్లను నిర్వహిస్తున్నారు. ఒక్కో సీ ప్లేన్‌లో గరిష్ఠంగా 15 మంది వరకు ప్రయాణించే అవకాశం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు