డా. కళ్యాణ్ రామ్‌కు ‘ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : అత్యవసర వైద్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న కిమ్స్ సవీర ఆసుపత్రి ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్, హెచ్ఓడీ డా. కళ్యాణ్ రామ్‌కు జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ఆయనకు ‘ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు’ను అందించారు. లక్నోలో నిర్వహించిన సాక్టెమ్ జాతీయ సదస్సులో ఈ పురస్కారాన్ని అందజేశారు. ఎమర్జెన్సీ మెడిసిన్‌కు సంబంధించిన అంశాలను సోషల్ మీడియా వేదికగా ప్రజలకు చేరువ చేస్తూ.. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన ప్రాథమిక చర్యలు, ప్రాణరక్షక పద్ధతులు, సకాలంలో వైద్యం అందించడం వల్ల కలిగే ప్రయోజనాలపై డా. కళ్యాణ్ రామ్ అవగాహన కల్పిస్తున్నారు. ఈ సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అమిత్ కుమార్ ఘోష్, ఐఏఎస్, జాతీయ ఆరోగ్య మిషన్ మిషన్ డైరెక్టర్, వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డా. పింకీ జోవెల్, ఐఏఎస్ చేతుల మీదుగా డా. కళ్యాణ్ రామ్ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా డా. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ అత్యవసర వైద్యం గురించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా సమాచారం అందించడంతో పాటు.. ఆపద సమయంలో సరైన సమయంలో సరైన చర్య తీసుకునేలా అవగాహన కల్పించడమే తన లక్ష్యమని తెలిపారు. జాతీయ స్థాయిలో లభించిన ఈ గుర్తింపు కిమ్స్ సవీర ఆసుపత్రితో పాటు అనంతపురం వైద్య రంగానికి గర్వకారణమని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
కిమ్స్ సవీర వైద్యుడికి జాతీయ గుర్తింపు
- Advertisement -


