-ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్
విశాలాంధ్ర-రాప్తాడు : టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ఎన్.టి.రామారావు, ప్రజా నాయకుడు దివంగత పరిటాల రవీంద్రల విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఈనెల 22న రాప్తాడులో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు, టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి తెలిపారు. మంగళవారం స్థానిక స్థూపం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన ధర్మవరపు మురళి మాట్లాడుతూ… “తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి, అభివృద్ధికి ప్రతీకలైన ఎన్టీఆర్, పరిటాల రవీంద్రల విగ్రహాలను ఒకే వేదికపై ఆవిష్కరించుకోవడం మన రాప్తాడు ప్రజలందరికీ గర్వకారణమన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి రాష్ట్ర ఐటీ, సమాచార సాంకేతిక శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని అన్నారు. ఇప్పటికే స్థూపంపై విగ్రహాల అమరిక పనులు పూర్తయ్యాయన్నారు. మంత్రి లోకేష్ రాక సందర్భంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా, క్రమశిక్షణతో ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. ఈ విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని దిగ్విజయం చేసేందుకు రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు మరియు ప్రజలు స్వచ్ఛందంగా, పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్, ప్రధాన కార్యదర్శులు పంపు కొండప్ప, దగ్గుపాటి శీనా, సొసైటీ చైర్మన్ మరూరు గోపాల్, స్థూపం నిర్మాణదాత సాకే జయరాముడు, గుజ్జల నారాయణస్వామి, బోయ వెంకటరాముడు, గంగలకుంట కృష్ణ, సి.గంగాధర్, తెలుగు యువత రాజశేఖర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


