Homeవిశ్లేషణభారత్ ‘భరతమాత’ ఎప్పుడయ్యింది?

భారత్ ‘భరతమాత’ ఎప్పుడయ్యింది?

- Advertisement -

హిందూ దేశం అన్నది ఈ దేశంలో విస్తరించిన విభిన్న మతాలు, వాటి శాఖలు, విశ్వాసాలు, ఆచారాల సమ్మేళనం. కానీ హిందుత్వవాదులు హిందూ దేశాన్ని ఒకే ఒక జాతిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. తమది ఒక అఖండ మతమని ప్రకటించుకుంటున్నారు. ఇతర జాతులు, మతాల కంటే తమ జాతి మతమే గొప్పదని భావిస్తున్నారు. భిన్నత్వాన్ని తిరస్కరించే ఈ విచిత్రమైన ధోరణే ఒక అయోమయపు హిందూ అస్థిత్వవాదాన్ని సృష్టించింది. అదే ఆవేశాలకు, అరాచకత్వాలకు దారితీస్తూ ఉంది. దానికి అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు, వారికి వత్తాసు పలికే సనాతన ఛాందస మత సంస్థలూ ఉన్నందు వల్ల నానాటికీ విషయం జటిలమౌతూ ఉంది. ఈ హిందుత్వ వాదులకు ఆవును పూజించడం ఒక ప్రధాన కార్యక్రమం. దాని మూత్రం, పేడా వీరికి పవిత్రం. ఇక అందరి దేవుళ్లకన్నా తమ దేవుడు రాముడే గొప్ప మహిమగల వాడని నిర్ధారించడం, ఇతర మత గ్రంథాలకన్నా తమ రామాయణం సర్వోన్నతమైందని తేల్చి చెప్పడం హిందుత్వ సంస్థలు చేస్తున్న పని! వీటితో పాటు మనుస్మృతిని ఈ కాలంలో చలామణి చేయడానికి తీవ్రంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదంతా ఒక కృత్రిమ వికృత పరిస్థితి. దీని వల్ల దేశంలో సాంస్కృతిక, రాజకీయ వాతావరణం కలుషితమౌతూ ఉంది. వెరసి, దేశం చీకటి యుగంలోకి నెట్టివేయబడుతూ ఉంది. ఇలాంటి మూఢత్వం హిందూ మతతత్వవాదుల్లో మాత్రమే లేదు. ఇతర మతాలలో కూడా ఉంది. ఉదాహరణకు ముస్లిం, క్రైస్తవ మతతత్వవాదుల్ని చూద్దాం. కేవలం వారి దేవుణ్ణి నమ్మితేనే స్వర్గం లభిస్తుందని లేకపోతే నరకానికి వెళ్లక తప్పదని ముస్లిం, క్రైస్తవులు కలిపి 380 కోట్ల మంది గుడ్డిగా నమ్ముతున్నారు. వాస్తవానికి 2 వేల సంవత్సరాల క్రితం ఈ రెండు మతాలూ గాని, వారి దేవుళ్లు గానీ లేరు. మరి లక్షల సంవత్సరాల క్రితం పుట్టి పెరిగిన మనుషుల సంగతేమిటీ? అప్పుడు కూడా ప్రపంచముంది. జీవితముంది. అంటే ఏ దేవుడి అవసరం లేకుండానే ప్రపంచముంది. మానవ జీవితమూ ఉందనేది అర్థం చేసుకోవాలి! తమ రామాయణమే సర్వోన్నతమైందని ప్రగల్భాలు పలికేవారు. రామాయణం ఆధారంగా పుష్పక విమానాలు ఎందుకు తయారు చేయడం లేదూ ? రాఫెల్ యుద్ధ విమానాలు కొనడమెందుకూ ? అందులో మళ్లీ అవినీతి ఎందుకూ ? వెరసి, ప్రజల్ని పిచ్చివాళ్లను చేస్తూ వారి సొమ్ము మింగడమెందుకూ ? అందుకే మన తెలుగుకవి ఆరుద్ర తన కూనలమ్మ పదాల్లో ఇలా అన్నారు.“కసిని పెంచె మతము కనులు గప్పి గతము కాదు మన కభిమతము / ఓ కూనలమ్మా !
ఈ దేశంలో రాముడు ఓ రాజకీయ దేవుడు. అయోధ్యలో రామమందిరం అంశంపై ప్రతి ఎన్నికలకు ముందు రాజకీయాలు వేడెక్కుతుంటాయి. వాస్తవ పరిస్థితి ఏమిటంటే ఉత్తర భారతదేశంలో 17వ శతాబ్దం చివరి వరకు, 18వ శతాబ్దం ప్రారంభం వరకూ రాముడికి ప్రత్యేకంగా ఆలయం లేదని ప్రఖ్యాత భారత చరిత్రకారుడు డి.ఎన్.ఝ² చెపుతున్నారు. ప్రతిసారి రాముడు ఒక రాజకీయ నాయకుడిగా అవతరిస్తున్న వేళ, ఈ చరిత్రకారుడీ ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. హిందుత్వవాదులు చెప్పే విషయాలు పక్కన పెడితే, ఒక్క మధ్యప్రదేశ్‌లో తప్ప ఉత్తరభారతంలో పది పేర్లు- పద్దెనిమిది శతాబ్దాలకు ముందు రామాలయాలుండేవని ఆధారాలు లేవు. పరిశోధనలు చేసి నిగ్గు తేల్చిన చరిత్రకారుల మాట మనం విశ్వసించాలి. మధ్యప్రదేశ్‌లో మాత్రం వారి పరిశీలనలో 12వ శతాబ్దపు రామాలయాలు ఒకటి రెండు బయటపడ్డాయి అంతే ! అయోధ్యలో జైనమతం, బౌద్ధమతం వంటి ఇతర మతాలు ప్రముఖంగా ఉండేవని, 1528లో మిర్ బఖీ బాబ్రీ మసీదును నిర్మించే నాటికి అక్కడ రామాలయం లేదని ప్రొఫెసర్ డి.ఎన్.ఝ² రాశారు. ఇలాంటివి దేశంలో చాలా ఉన్నాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో చార్మినార్ నిర్మాణం జరిగినప్పుడు ప్రస్థుతం చుట్టూ ఉన్న హిందూ దేవాలయాలు లేవు. అవన్నీ తర్వాత కాలంలో కట్టబడ్డాయి. ఆర్కియాలజీ వారి ఛాయాచిత్రాలు పరిశీలిస్తే ఈ విషయం బోధపడుతుంది. హిందూ మతతత్వ వాదులు ‘భారతమాత’ అనే పదం విరివిగా వాడుతుంటారు. వీళ్లు ఒక దేశాన్ని ఒక మాతగా ఎలా మార్చారో చూద్దాం. (ఇటీవల ఒక ముఖ్యమంత్రి తెలుగు తల్లిని విడదీసి తమది తెలంగాణ తల్లి అని ప్రకటించుకున్నారు). క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దంలో మొదటిసారి ఖారవేలుడి శాసనంలో ‘భరతవరü’ అని ఒక ప్రస్తావన కనిపిస్తుంది. బహుశా అది ఉత్తర భారతదేశాన్ని ఉద్దేశించింది కావచ్చు. అయితే అందులో మగధ లేదు. అలాగే మహా భారతంలో ‘భారత’ పదం ఉత్తర దేశంలోని ఎక్కువ భాగాన్ని సూచిస్తుంది కానీ, దక్షిణ భారత దేశం గురించి అందులో ఏమీ చెప్పలేదు. అవి రాసిన, ఆనాటి రచయితలు వారికి తెలిసిన ప్రాంతాల గురించి మాత్రమే రాసి ఉంటారు. ‘భరత వరü’ అనే పదం ఎక్కువగా పురాణాల్లో కనిపిస్తుంది కానీ, అవి ఈ దేశపు ఆకారాన్‌ని వర్ణించలేకపోయాయి. కొన్ని పురాణాలు ఈ దేశాన్ని చంద్రుడితో పోల్చాయి. ఇది త్రిభుజాకారంలో ఉన్నట్లు కొన్నింటిలో ఉంది. మరికొన్నింటిలో ఇది నారి చాచిన విల్లు ఆకారంలో ఉందని ఉంది. చతుర్భుజాకారంలో ఉందని కొన్ని , అసమ చతుర్భుజాకారంలో ఉందని మరికొన్నింటిలో ఉంది. పురాణాలు సృజనాత్మక రచనలు గనక రచయితలు ఎవరి సృజనాత్మకత వారు చూపించారు. అయితే వీటన్నింటిలో ఎవరూ ఇండియాను ‘తల్లి’గా చిత్రించలేదు. అలాంటి భావన తర్వాత కాలంలో వచ్చింది. మొదటిసారి భారతదేశాన్ని స్త్రీ మూర్తిగా, తల్లిగా వర్ణించడం ద్విజేంద్ర రాయ్ (1863-1913) రాసిన ఒక పాటలో కనిపిస్తుంది. ఆ తరువాత బంకించంద్ర ఛటర్జీ రాసిన “ఆనంద్ మఠ్ (1882) నవలలో కనిపిస్తుంది. (హేమన్ గుప్త దర్శకత్వంలో ‘ఆనంద్ మఠ్’(1952) హిందీ చలనచిత్రంగా వెలువడినప్పుడు పృథ్వీ రాజ్కపూర్, గీతాబాలి, ప్రదీప్ కుమార్, భరత్ భూషణ్ వంటి నాటి మేటి నటీ నటులంతా అందులో పాత్రలు పోషించారు. హేమంత్ కుమార్ సంగీతం దేశాన్ని ఒక కుదుపు కుదిపింది). ఒక భావనగా రచనల్లో వర్ణించడం అయ్యాక ‘భరతమాత’ తొలిసారి మానవ రూపంలో అవనీంద్రనాథ్ టాగూర్ గీసిన వర’చిత్రం (1905) లో కనిపించింది. ‘భరతమాత’ను ఆయన ఒక హిందూ వైష్ణవ సన్యాసిని రూపంలో చిత్రించారు. ఆ తర్వాత చాలా ఏళ్లకు వారణాసిలో నిర్మించిన భరతమాతా ఆలయంలో మొదటిసారి ఆమెను దేశపటం రూపం (1936) లో రూపొందించారు. ఒక ఊహ-భావనగా మొదలై వాస్తవంగా మారింది. కాని ఇప్పుడు మన వీర హిందూ మతతత్వవాదులు వాస్తవాన్ని ఊహగా మార్చాలనుకుంటున్నారన్న మాట! తిరోగమనానికి ఇదొక తిరుగులేని ఉదాహరణ. గోవు ఒక సాధు జంతువు. దాన్ని మనవాళ్లు గోమాతగా ఎలా చేశారో… చూద్దాం. మధ్యయుగంలో గోవు ఒక భావావేశ సాంస్కృతిక చిహ్నంగా ఆవిర్భవించింది. శివాజీ సారథ్యంలో మరాఠాశక్తి బలపడడంతో అది మరింత భావోద్వేగ భరితంగా మారింది. శివాజీ బ్రాహ్మణుల్ని, గోవుల్ని రక్షించడానికే దేవుడిగా అవతరించాడని కొందరు ఆయన్ని కీర్తించారు కూడా! 1870లలో సిక్కుల కుకా ఉద్యమం ఊపందుకున్నప్పుడు సామాన్య జనాన్ని రాజకీయంగా సమీకరించడానికి గోచిహ్నం బాగా ఉపయోగపడింది. దయానంద సరస్వతి తొలి గోరక్షణ సమితిని ప్రారంభించింది కూడా దాదాపుగా ఆ కాలంలోనే కావడం… గోరక్షణ ఉద్యమం బాగా బలపడడం… ఫలితంగా గోవు జంతువు నుంచి మాతస్థాయికి ఎదిగింది. గోవు గోమాతతో పాటు దేశం దేశమాత అయింది. అంటే భారతదేశం భారతమాతగా మారింది. వేద కాలంలో తమని తాము బలంగా ఉంచుకోవడానికి గోమాంసం తిన్నవారు, తర్వాత కాలంలో బౌద్ధమత ప్రభావంతో శాఖాహారులయ్యారు. అంతవరకు ఫరవాలేదు. కాని ఈ రోజు గోమాంస భక్షకుల మీద మళ్లీ వారే దాడులు చేయడం విడ్డూరం. వారు ఉంటే తినాలి. వారు మానేస్తే మానెయ్యాలా? ఇదేం అధిపత్యం ? ప్రజల నిత్యావసరాలు చూడడం మాని, రాముడినీ, గోవుని, పురాణాల్ని తమ స్వార్థపూరిత కుళ్లు రాజకీయాలకు ఉపయోగించుకుంటున్న వారిని తెలుగు కవి జ్వాలా ముఖి తీవ్రంగా దుయ్యబట్టారు. “చచ్చిన రాజుల పుచ్చిన గాథల / మెచ్చే చచ్చు చరిత్రకారులను / ముక్కు చెవులు కోసి అడగాలనుంది / మానవ పరిణామం నేర్పిందేమని ? ” మెదడు ఉన్న వారికి ఆలోచించడం ప్రారంభించిన వారికి విషయం బోధపడుతుంది.
సుప్రసిద్ధ సాహిత్యవేత్త, బయాలజీ ప్రొఫెసర్ (రి)

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు