బ్యాంకుల సమ్మె వేళ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: బ్యాంకుల సమ్మె వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. దీంతో 27వ తేదీ ఆదివారం సెలవు రద్దు చేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఒక ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు యథావిథిగా సేవలు అందించాలని ఆదేశించింది. వరుసగా ఐదు రోజులు (వారాంతపు సెలవులు కలుపుకుంటే) బ్యాంకుల సేవలకు అంతరాయం కలుగుతుంది. ప్రొసిసెంగ్ వ్యవహారాలు, నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్ వంటి పనులు నిలిచిపోతాయి. 26, 27 తేదీల్లో (శని, ఆదివారం) సాధారణ సెలవుల దృష్ట్యా 27న ఆదివారం పని చేయాలని బ్యాంకులకు ఆర్థిక శాఖ సూచించింది. కాగా, బ్యాంకు యూనియన్ల డిమాండ్లలో చాలా వరకు పరిష్కరించామనీ, మిగతావి పరిశీలనలో ఉన్నట్టు పేర్కొంది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి కృషి చేయాలని… బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని సూచించింది. ఇదిలావుంటే, ఐదు రోజుల పని దినాల విధానం అమలు చేయాలని, పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇచ్చింది.
విశాఖలో ఒక్కరోజు నిరసన
విశాఖలో యూఎఫ్బీయూ అధ్వర్యంలో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె జరిగింది. సిబ్బంది నల్ల దుస్తుల్లో పాల్గొన్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈనెల 11న సమ్మె చేసినప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడంపై బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఆందోళనలు ఆగబోవని, పోరు మరింత తీవ్రతరం చేస్తామని బ్యాంకు ఉద్యోగులు హెచ్చరించారు.


