Homeజాతీయంజ్ఞానేశ్ రాజీనామా చేయాల్సిందే: సీపీఐ

జ్ఞానేశ్ రాజీనామా చేయాల్సిందే: సీపీఐ

- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఎన్నికల సంఘంలో తీవ్ర సంక్షోభం నెలకొందని పార్టీ జాతీయ కార్యదర్శి వర్గం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దర్యాప్తును ఉటంకిస్తూ జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలపై ఎన్నికల కమిషనర్‌లు సంధు, జోషి 10 నెలల్లో 14 సార్లు అభ్యంతరం చెప్పినట్లు గుర్తుచేసింది. అధికారాల కేంద్రీకరణపై కేబినెట్ కార్యదర్శిని కూడా ఇద్దరు కమిషనర్‌లు సంప్రదించారని సీపీఐ తెలిపింది. వీళ్ల అభ్యంతరాలను పట్టించుకోకుండా సీఈసీ ముందుకు తీసుకెళ్లారని, ఫలితంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 13 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘం నిర్ణయాలు, అనుసరించిన విధానాన్ని సుప్రీంకోర్టు పరిశీలించాలని సీపీఐ సూచించింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు తమకు అనుకూలంగా ఓటర్లను ఎంచుకునే పరిస్థితి ఉండకూడదని మరోమారు హెచ్చరించింది.సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వైఖరి ఎన్నికల వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని బలహీనపర్చిందని, ఈ పదవిలో కొనసాగేందుకు ఆయన అర్హుడు కాదని వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘంపై ప్రజా విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే జ్ఞానేశ్ కుమార్ తక్షణమే సీఈసీ బాధ్యతల నుంచి తప్పకోవాలని, రాజీనామా సమర్పించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈసీఐ తీసుకున్న నిర్ణయాలు… అందుకు అనుసరించిన విధానాన్ని సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించాలని కోరింది. 2023లో సీఈసీ, ఎన్నికల కమిషనర్‌ల నియామక ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులు ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని నీరుగార్చినట్లు విమర్శించింది. అర్హతగల ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంటుందని, అన్ని పరిస్థితుల్లోనూ ఇందుకు కట్టుబడటం ఎన్నికల సంఘం బాధ్యత అని సీపీఐ స్పష్టం చేసింది.
జ్ఞానేశ్కు పదవిలో కొనసాగే అర్హత లేదు: సీపీఎం
సీఈసీగా కొనసాగే అర్హత జ్ఞానేశ్ కుమార్‌కు లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు. ఆయన పదవిలో నుంచి వైదొలగాలి లేదంటే ప్రభుత్వమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఐఆర్‌ను ఆపేయాలన్నారు.
జాతీయ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ ప్రక్రియను పున:పరిశీలించాలని, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించాలని సూచించారు. ‘ఎన్నికల సంఘంలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. ప్రతి నిర్ణయం ఏకగ్రీవంగా లేదా మెజారిటీ ఆధారంగా జరుగుతుంది. కానీ మిగతా ఇద్దరిని నిర్లక్ష్యం చేస్తూ వారి సలహాలు, సూచనలు విస్మరిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇది అప్రజాస్వామికం, చట్ట వ్యతిరేకం. కాబట్టి ఆయన ఈ పదవిలో కొనసాగే అర్హతను కోల్పోయారు’ అని బేబీ వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు