Homeజిల్లాలుశ్రీ సత్యసాయితాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన..

తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన..

- Advertisement -

శెట్టూరు: మండల పరిధిలోని యాటకల్లు గ్రామంలో గత పది రోజులుగా నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్థులు శుక్రవారం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం ఎదుట నిర్వహించిన ఈ ఆందోళనలో మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. పది రోజులుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం గ్రామ సచివాలయంలోని పంచాయతీ కార్యదర్శి నందినిని సంప్రదించగా, అందుబాటులో ఉన్న నీటితోనే సర్దుకోవాలని, నిధులు లేవని తెలిపినట్లు పేర్కొన్నారు.దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు కలిసి సచివాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.సమాచారం తెలుసుకున్న శెట్టూరు ఎంపీడీవో జిలాన్ భాష, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారి సురేంద్ర ప్రసాద్ సచివాలయం వద్దకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. గ్రామంలోని తాగునీటి సమస్యతో పాటు వీధిలైట్ల సమస్యను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే శుక్రవారం నుంచే గ్రామంలోని ప్రతి వీధికి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తామని తెలిపారు.అధికారుల హామీతో గ్రామస్థులు ఆందోళన విరమించారు. అయితే ట్యాంకర్ల ద్వారా తాత్కాలికంగా నీటి సరఫరా చేయడంతో పాటు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు సాకే గురుమూర్తి, మండల అధ్యక్షుడు వెట్టి తిప్పేస్వామి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీపీ బెస్త రామ భీమప్ప, మాజీ సర్పంచ్ గొల్ల ఈరన్న, గ్రామ కమిటీ అధ్యక్షుడు నీరుగంటి సత్యనారాయణ, రామ్మూర్తి, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు