Homeజిల్లాలుఅనంతపురంభూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపించాలి.. ...

భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపించాలి.. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం: సీపీఐ నేత డి. జగదీష్

- Advertisement -

విశాలాంధ్ర – అనంతపురం సిటీ: అనంతపురం నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, డబుల్ రిజిస్ట్రేషన్ల ద్వారా భూములను కబ్జా చేస్తున్న వారిపై సమగ్ర విచారణ జరిపించి, బాధితులకు న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దేవరగుడి జగదీష్ డిమాండ్ చేశారు. అనంతపురం రూరల్ పరిధిలోని నారాయణపురం పంచాయతీ పరిధిలో బుడబుక్కల వారికి చెందిన ఎకరా 30 సెంట్ల భూమితో పాటు, దాని పక్కనే ఉన్న మూడు ఎకరాలు, రుద్రంపేట పంచాయతీ పరిధిలోని కక్కలపల్లి సమీపంలో ఉన్న 90 సెంట్ల భూమి, బళ్లారి రోడ్డు సమీపంలోని శ్రీకృష్ణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యానికి సంబంధించిన ఎకరా భూమిని అధికార పార్టీ ముసుగులో రిజిస్టర్ కార్యాలయం అధికారులను లోబరుచుకొని డబల్ రిజిస్ట్రేషన్ చేసుకుని కబ్జాకు తెర లేపారని బాధితులకు న్యాయం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దేవర గుడి జగదీష్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం బాధితులతో కలిసి డి. జగదీష్ ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూములను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఏడాదిన్నర కాలంగా అధికార పార్టీ అండదండలతో కొందరు అమాయక ప్రజల ఆస్తులను లక్ష్యంగా చేసుకుని, సంబంధిత అధికారులను లోబరుచుకుని నకిలీ పత్రాలు సృష్టిస్తూ డబుల్ రిజిస్ట్రేషన్లకు పాల్పడి భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. బాధితులు తమకు జరిగిన అన్యాయంపై పలుమార్లు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు వినతిపత్రాలు సమర్పించి న్యాయం చేయాలని కోరినప్పటికీ స్పందన లేదని విమర్శించారు. డబుల్ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, బాధితులకు వారి భూములను తిరిగి అప్పగించి న్యాయం చేయాలని కూటమి నాయకులు ఆదేశించినప్పటికీ, ఇప్పటివరకు బాధితులకు న్యాయం జరగలేదని అన్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఆక్రమణదారులకు మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు.భూముల ఆక్రమణలపై జిల్లా కలెక్టర్, ఎస్పీ తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జగదీష్ డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీ. జాఫర్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు దాదాగాంధీ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జె. రాజారెడ్డి, నగర కార్యదర్శి ఎన్. శ్రీరాములు, సహాయ కార్యదర్శులు బి. రమణ, వి. కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు