ఆరు దీచక్ర వాహనాలు స్వాధీనం
విశాలాంధ్ర -డుంబ్రిగుడ: చోరికు గురై కనిపించకుండా పోయిన ద్విచక్ర వాహనాలను స్థానిక పోలీసులు చాకచాక్యంగా పట్టుకుని రెండు రోజుల్లో చేదించారు. దీనికి సంబంధించి డీఎస్పీ రాజాసింహరెడ్డి స్థానిక పోలీసు స్టేషన్లో శనివారం విలేకరులతో వెల్లడించారు. గత నెల 29న కుసుమవలస గ్రామానికి చెందిన వంతాల త్రినాథ్ అనే గిరిజనుడు పల్సర్ బైకు చోరికి గురైందని స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. కేసును నమోదు చేసిన ఎస్సై సురేష్ చోరిపై విస్త్రత తనిఖీలు చేపట్టారన్నారు. జాతీయ రహదారిలో విస్త్రతంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా నంబరు ప్లేట్లు లేని వాహనాలతో మైనర్లు నడుపుతుండడంపై ఆరా తీశారు. ఈ మేరకు నలుగురు మైనర్లను విచారించగా గుట్టు బయట పడిందన్నారు. శృంగవరపుకోటలోని ఆర్టీసీ బస్ స్టేషన్లో స్కూటీ, హుకుంపేట సంతలో పల్సర్ బైకు, చటువాలో పల్సర్, పాడేరు కాంప్లెక్స్ లో ఒకటి, అరకులోయలో ఒకటితోపాటు విడి భాగలు తీసిన పల్సర్ బైకుతో ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. బడికి దూరమైన మైనర్లు ద్విచక్ర వాహనాల మీద మోజుతోపాటు, జల్సాలకు అలవాటు పడుతూ ఇలాంటి చోరిలకు పాల్పడుతున్నారని చెప్పారు. మైనర్లపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరమన్నారు. బడికి వెళ్తున్నారనే దానిపై ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుని జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుందని, లేనిపక్షంలో చెడు వ్యసనాల జోలికే బంగారు భవిష్యత్తును నాశనం చేసుకునే అవకాశం ఉందని, తల్లిదండ్రులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నలుగురు మైనర్లతోపాటు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి, వారు చదువుకునే విధంగా చర్యలు చేపడతామని అన్నారు నలుగురు మైనర్లను చోరికి సహకరించిన హుకుంపేట మండలం రంగశీల పంచాయతీ బోడిగుడ గ్రామానికి చెందిన కుంబిడి వెంకటరావు అనే నిందితుడిని రిమాండ్ తరలించామని ఆయన పేర్కొన్నారు. సీఐ కోటేశ్వరరావు, అరకులోయ ఎస్సై మల్లేశ్వరరావు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


