ఈ నెల 8వ తేదీన గుంతకల్లు లో రౌండ్ టేబుల్ సమావేశం
విశాలాంధ్ర – గుంతకల్లు: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు విజ్ఞతతో, మనస్సాక్షి ప్రకారం ఓటు వేయాలని, ఓటుకు నోటు విధానాన్ని ప్రజలు తిరస్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ పిలుపునిచ్చారు. శనివారం గుంతకల్లులోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు సంస్కృతిని రాజకీయ పార్టీ నాయకులే ప్రోత్సహిస్తున్నారని జగదీష్ విమర్శించారు. డబ్బులు తీసుకొని ఓటు వేయడం వల్ల ప్రజాప్రతినిధులకు ప్రజా సమస్యలు, అభివృద్ధిపై బాధ్యత తగ్గిపోతోందని ఆరోపించారు. ఈ పరిస్థితుల కారణంగా ప్రజాప్రతినిధుల్లో అవినీతి పెరుగుతోందని, సామాన్య ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతోందని, భూకబ్జాలు అధికమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, సెక్యూరిటీ గార్డులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల్లో కొంతమంది ప్రజాప్రతినిధులు లంచాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గుత్తేదారులను బెదిరించి కమీషన్లు వసూలు చేస్తున్నారని, బదిలీలు, పోస్టింగుల విషయంలోనూ అవినీతి జరుగుతోందని విమర్శించారు.తమిళనాడు రాష్ట్రంలో అవినీతిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్న జగదీష్, ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి పెరిగిపోతోందని అన్నారు. మేయర్, చైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్ పదవులకు అభ్యర్థుల ఎంపికలో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పదవులు పొందినవారు, ఆ మొత్తాన్ని తిరిగి సంపాదించుకునేందుకు అవినీతికి పాల్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించాలంటే ఓటర్లు డబ్బులకు లొంగకుండా, నిజాయితీగల అభ్యర్థులను ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఓటుకు నోటు విధానాన్ని ప్రజలు తిరస్కరించి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 8వ తేదీన గుంతకల్లులో సీపీఐ ఆధ్వర్యంలో మేధావులు, విజ్ఞానవంతులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు జగదీష్ తెలిపారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి. గోవింద్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బి. మహేష్, సీపీఐ పట్టణ కార్యదర్శి ఎస్.ఎం.డి. గౌస్, గుంతకల్లు మండల కార్యదర్శి పి. రాము రాయల్, మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులు యాదవ్, ఏఐటీయూసీ అధ్యక్షులు ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.


