చింతపట్ల సుదర్శన్
ఇంకొన్ని రోజుల్లో సిటీలో పిల్లుల ప్రదర్శన ఉందట. నల్లవీ, తెల్లవీ, గోధుమరంగువీ పిల్లుల్లో చాంపియన్ ఎవరో తేలుస్తారట అంది డాంకీ అరుగుమీద కూచుని తాపీగా. పిల్లులేమిటి, చాంపియనేమిటి అవసరమా? అంది డాగీ తన తోక వైపు చూసుకుంటూ. ‘నీకేం తెల్సు బ్రో’ ఆ మధ్యన ఓ ముసల్ది తన ఆస్తి మొత్తం పిల్లికి రాసిచ్చి చచ్చిందట. పిల్లులేనా అని తీసిపారేయకు కొన్ని దేశాల్లో పిల్లి ఎదురుగ్గా వస్తే నక్క తోకను తొక్కినంత సంబరపడిపోతారు తెలుసా అంది డాంకీ. నీకేం తెల్సు అని అననే అన్నావు కదా నాకేం తెలీదు బ్రో. చాంపియన్ పోటీ పిల్లులకే కాని డాగ్లకు లేదా? ఎందుకు లేదు డాగ్ షోలు నిర్వహిస్తారు కదా కాకపోతే ఆ వైభోగం అంతా పెట్ డాగ్స్కీ జాతి కుక్కలకీ కాని నీలాంటి వీధికుక్కలకి కాదు సుమా క్లాసూ మాసూ తేడా ఉంటుంది మరి అంది డాంకీ. ఉంటుందుంటుంది మనుషుల్లోనూ ఉంటుంది. రెక్కాడితే డొక్కాడని వాడు నాలా మాస్ కారు దిగని వాడు క్లాస్. ఓటు వేసే వాడు మాస్. వేయించుకుని అధికారం చలాయించేవాడు క్లాస్ అంటూ ఆవులించింది డాగీ. ఓటంటూ ఓటి ఉంటే ఆ మనిషికి ఎన్నికల ముందు కాస్త గౌరవం, బుజ్జగింపు దక్కుతాయి కాని ఆ ఓటు గల్లంతయితే అడిగే దిక్కెవరు? పదమూడు కోట్ల ఓట్లు ఒకటా రెండా! గంగలో కలిసేయో, సముద్రంలో ములిగాయో! అని డాంకీ అంటుంటే డాగీ చెవులు రిక్కించింది. దీనికి ఏదో అలికిడి వినిపించింది ఇక అసెంబ్లీ రౌడీలా రెచ్చిపోతుంది అనుకున్న డాంకీ, ఏమయింది ‘బ్రో’ ‘గోడ మీద పిల్లి ఏమైనా కనిపించిందా ? లోపలి గదిలోకి చెడ్డీ గ్యాంగ్ దొంగోడెవడైనా దూరేడా అనడిగింది డాంకీ. ఈ డాగీ ఇక్కడుండగా ఆ పిల్లిగాడికెంత ధయిర్యం చెడ్డీ గ్యాంగు దొంగ అపార్ట్మెంటుల్లో దూరుతాడు కాని కూలిన కొంపలో మట్టి కోసం దూరుతాడా అంది డాగీ. అయితే మరేం కనిపించిందో చెప్పరాదూ, కిచకిచ కోతేమోనని అనుమానం. నేను అరుగు ఎక్కుతుంటే గోడ మీది నుంచి గంతులు వేస్తూపోయింది. అదే మళ్లీ వచ్చిందేమో. కోతా ? యూ మీన్ మంకీ! నో ఛాన్స్, చెట్ల కొమ్మల్లో బంగీ జంపులు చేసే కోతి ఊళ్లోకి ఎందుకు వస్తుంది అంది డాంకీ. ఎందుకు రాదూ దానికి కొంప లేకుండా చేస్తే! అధికారం దక్కిన ప్రతి లీడరూ అడవులు నరుక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే, తిండానికి తిండి దొరక్క, ఉండానికి చెట్ల కొమ్మల్లేక ఊరి మీద పడ్తున్నట్టున్నవి. అయినా ఈ మనుషులకి విశ్వాసమనేదే లేనట్టుంది. కోతి నుంచి వచ్చిన మనిషే కోతికి కొంప లేకుండా చెయ్యడం దేనికి అంది డాగీ. నువ్వన్నదాన్లో పాయింటు లేకపోలేదు సుమీ. ఊళ్లోకి వచ్చిన కోతులు ఊరికే ఉండవు కదా! మీలా తోక ఊపుకుంటూ! ఎవరైనా ఏమైనా పెడతారా అని ఉచిత పథకాల కోసం చూసే మనుషుల్లా ఉండవు కదా… పొలాలు ధ్వంసం చేస్తయి. చెట్ల మీద పళ్లు రాలగొడ్తయి ఇళ్ల మీదికెక్కి తైతక్కలాడ్తయి అంది డాంకీ. అందుకే కోతులు పొలాల్లోకి రాకుండా కరెంటు కంచెలు కడుతున్నారట కద అని డాగీ అంటుంటే అరుగు ఎక్కాడు అబ్బాయి. రా! బ్రదర్ రా! మీ ముత్తాత తాత ముత్తాత గురించే మాట్లాడుతున్నాం. మాలాంటి డాగ్లనయితే హుష్షు హుష్షు అనో రాళ్లేసి కొట్టో తోలేస్తారు కాని లంగూర్లని తోలెయ్యలేరు కదా మేం పెంచినా, పెంచకపోయినా, మనుషుల పట్ల విశ్వాసంతో ఉన్నాం కానీ కోతులు అలా కాదే అంది డాగీ. ఓహో మా పూర్వీకుల గురించా చర్చ. మరి మూడు కోతుల గురించి కూడా మాట్లాడుకున్నారా అన్నాడు అబ్బాయి అరుగు మీద కూచుంటూ. ఏ మూడు కోతుల గురించి భయ్యా అంది డాంకీ. అవే కళ్లు మూసుకున్న కోతి, నోరుమూసుకున్న కోతి, చెవులు మూసుకున్న కోతి వాటి గురించి అన్నాడు అబ్బాయి. పళ్లికిలించే కోతుల గురించి, గోళ్ళతో రక్కే కోతుల గురించి విన్నాం కాని ఈ మూడు కోతుల గురించి విననే లేదు చెప్పు చెప్పు అన్నవి డాగీ, డాంకీ. కళ్లు మూసుకున్న కోతి అంటే న్యాయానికి సింబల్ అన్న మాట. న్యాయానికి కళ్ళు లేవనే విషయం తెల్సుకదా! ఇక నోరు మూసుకున్న కోతి అంటే ఎన్ని అరాచకాలు జరిగినా ఎంత అధికార దుర్వినియోగం జరిగినా నోరు తెరవదన్నమాట. అది మామూలు మనిషే కానక్కర్లే మీడియా కూడా కావచ్చును అన్నాడు అబ్బాయి. మరి చెవులు మూసుకున్న కోతి సంగతేమిటి అంది డాగీ. ఆ చెవులు మూసుకున్న కోతినే ప్రభుత్వం అనాలి. ఎవరు ఎంత ఏడ్చి మొత్తుకున్నా వినకుండా, వినిపించకుండా చెవులు మూసుకునే కోతే ప్రభుత్వం హామీల గురించి అడిగినా వినదు. అక్రమాల గురించి అడిగినా వినిపించుకోదు అన్నాడు అబ్బాయి. నిజమే పేపర్ లీకు గురించి అడగవద్దు, ‘సర’ ప్రక్రియ గురించి నోరు తెరవద్దు ధర్నాలు, రాస్తారోకోలు లాంటివి చెయ్యద్దు అని డాంకీ అంటే చెప్పాడుగా బ్రో! ప్రభుత్వం అంటే చెవిటి మేళం అని జనం ఏం చేసినా చెవిటోడి ముందు శంఖం ఊదడమేనని అంది డాగీ. మొత్తానికి మనది మూడు కోతుల దేశం అన్నమాట అంటూ పళ్లికిలించింది డాంకీ.


