-శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు
అనంతపురం రూరల్ ఎస్.డి.పి.ఓ అశ్విన్ మణిదీప్ కాకుమాను ఐపీఎస్
విశాలాంధ్ర-రాప్తాడు : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా నిర్వహించడమే తమ ప్రధాన లక్ష్యమని అనంతపురం రూరల్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి (డీఎస్పీ) అశ్విన్ మణిదీప్ కాకుమాను ఐపీఎస్ స్పష్టం చేశారు. ఇటీవల అనంతపురం రూరల్ ఎస్.డి.పి.ఓగా బాధ్యతలు చేపట్టిన ఆయనను విశాలాంధ్ర ప్రతినిధి శ్రీనివాసులు గురువారం తన కార్యాలయంలో విశాలాంధ్ర ప్రతినిధి శ్రీనివాసులుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన స్థానిక ఎన్నికల భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా వివరించారు. గుంటూరు జిల్లాకు చెందిన అశ్విన్ మణిదీప్, బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసి యూపీఎస్సీ సివిల్స్ సాధించి ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ పరిధిలో పకడ్బందీ పోలీసు చర్యల వివరాలను ఆయన పంచుకున్నారు.
ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు:
సమస్యాత్మక గ్రామాలపై పరిశీలన
సబ్ డివిజన్ పరిధిలోని 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ఇప్పటికే ఎల్లనూరు, పుట్లూరు, అనంతపురం రూరల్ మండలం, కొడిమి, నరసనాయనకుంట తదితర గ్రామాలను స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలిస్తున్నామన్నారు.
రౌడీషీటర్లపై బైండ్ఓవర్లు -ఆయుధాల స్వాధీనం
గతంలో ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిపై, రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టి బైండ్ఓవర్ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. చట్టవిరుద్ధంగా ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేశామన్నారు.
అదనపు బలగాల మోహరింపు:
అతి సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతిభద్రతలను పటిష్టం చేసేందుకు అవసరమైన అదనపు పోలీసు బలగాలను, భద్రతా సిబ్బందిని ముందస్తుగానే సమకూర్చుకుంటున్నామని వివరించారు.
ట్రబుల్ మోంకర్స్, సోషల్ మీడియాపై సైబర్ నిఘా
ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించే ట్రబుల్ మోంకర్స్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు (ఫేక్ న్యూస్) చేసే వారిపై సైబర్ వింగ్ ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఉంచినట్లు తెలిపారు.
ఎలక్షన్ సెల్ ద్వారా నిరంతర కోఆర్డినేషన్
ఎన్నికల సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం డీఎస్పీ కార్యాలయంలో ప్రత్యేకంగా ‘ఎలక్షన్ సెల్’ ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా పరిధిలోని అన్ని స్టేషన్లతో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకుంటూ సమాచారాన్ని సమీక్షిస్తున్నామని తెలిపారు.
నాయకులకు, ప్రజలకు విజ్ఞప్తి
సబ్ డివిజన్ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో త్వరలోనే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పిస్తామన్నారు. నిబంధనలు ఖచ్చితంగా పాటించి, ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు పూర్తి కావడానికి నాయకులు, ప్రజలు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని డీఎస్పీ అశ్విన్ మణిదీప్ కాకుమాను ఐపీఎస్ పిలుపునిచ్చారు.


