అమెరికా పౌరుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని చెబుతూ ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచే డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికాలోకి అక్రమ వలసలను అడ్డుకోవడం లేదంటూ పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోలపై పన్నులు విధించారు. తాజాగా పనామా కాలువపై చైనా జోక్యాన్ని తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పలుమార్లు పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. పనామా కాలువ విషయంలో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని తాజాగా వెల్లడించారు. అవసరమైతే బలవంతపు చర్యలు ఉండొచ్చనే సంకేతాలిచ్చారు. అదేసమయంలో ఇందుకోసం బలగాలను ఉపయోగించాల్సిన అవసరం ఉండకపోవచ్చని ట్రంప్ చెప్పారు.
ఏంటీ పనామా కాలువ వివాదం..?
వాణిజ్య నౌకల రాకపోకలకు పనామా కాలువ అత్యంత కీలకం. పనామాతో అమెరికా ఒప్పందం కుదుర్చుకుని ఈ కాలువను 1914 లో నిర్మించింది. 1999 లో కాలువను పనామాకు అప్పగించింది. ఆ తర్వాత కాలువపై చైనా జోక్యం పెరిగిపోయిందని అమెరికా ఆరోపణలు గుప్పించింది. తమ నౌకల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తోందంటూ పనామాపై విమర్శలు చేసింది. ఫీజులు తగ్గించకపోతే కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని పలు సందర్భాలలో హెచ్చరించింది.
తాజాగా ట్రంప్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. పనామా కాలువను పరోక్షంగా చైనా నిర్వహిస్తోందని, అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పనామా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. అందుకే పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే, అగ్రరాజ్యం అమెరికా దురాక్రమణకు భయపడబోమని, ఈ విషయంలో అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పనామా ప్రెసిడెంట్ జోస్‌రౌల్ ములినో తేల్చిచెప్పారు.