శ్రీధర్ బాబు
విశాలాంధ్ర- హైదరాబాద్: తెలంగాణ యువతను కృతిమ మేథ(ఏఐ)లో నిపుణులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఏఐ వర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైటెక్ సిటీలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సేవలు అందిస్తున్న డిపాజిటరీ ట్రస్ట్, క్లియరింగ్ కార్పోరేషన్(డీటీసీసీ) నూతన కార్యాలయాన్ని సోమవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామన్నారు. 200 ఎకరాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీని నిర్మించబోతున్నట్టు చెప్పారు. వర్సిటీ నిర్వహణలో పరిశ్రమలు, నిపుణులను భాగస్వామ్యం చేస్తామన్నారు. యువత నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి. ప్రభుత్వం తరపున అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు. ‘మీకు నైపుణ్యమున్న మానవ వనరులను మేం అందిస్తాం. నిశ్చింతంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టండి’ అని కోరారు. ‘డీటీసీసీ భారత్‌లో తన రెండో కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. సుమారు 500 మందికి ఉపాధి దొరకబోతోంది. రాబోయే రోజుల్లో రెండు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. డీటీసీసీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రెనీ లారోకే మోరీస్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లిన్ బిషప్ పాల్గొన్నారు.