Homeజాతీయంప్రధాని పదవి వద్దనుకున్నా.. నేతల ఒత్తిడితో అంగీకరించా: సోనియా

ప్రధాని పదవి వద్దనుకున్నా.. నేతల ఒత్తిడితో అంగీకరించా: సోనియా

- Advertisement -

కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తన రాజకీయ జీవితంలోని కీలక ఘట్టాలపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 2004 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి పదవిని ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో తన ఆత్మకథలో వివరించారు. ప్రధాని పదవి చేపట్టకూడదని ముందుగానే నిర్ణయించుకున్నప్పటికీ,పార్టీ నేతల ఒత్తిడితో ఒక దశలో అంగీకరించాల్సి వచ్చిందని తెలిపారు. అయితే, చివరకు తన మనసు చెప్పిన నిర్ణయానికే కట్టుబడ్డానని పేర్కొన్నారు. సోనియా గాంధీ రాసిన ఆత్మకథ’బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌'(Belonging: A Journey of Love) మంగళవారం విడుదలైంది. ఇందులో తన కుటుంబ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలతో పాటు రాజకీయ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను ప్రస్తావించారు. ముఖ్యంగా 2004ఎన్నికల అనంతరం ప్రధానమంత్రి పదవిని తిరస్కరించడానికి దారితీసిన పరిస్థితులను వివరించారు.

రాహుల్‌, ప్రియాంక వద్దన్నారు: సోనియా
ఆ ఎన్నికలకు కొన్ని నెలల ముందే ప్రధాని పదవి చేపట్టకూడదని నిర్ణయించుకున్నట్లు సోనియా వెల్లడించారు. ఇదే విషయాన్ని తన పిల్లలు రాహుల్‌,ప్రియాంకలకు కూడా చెప్పినట్లు తెలిపారు. తన అత్త ఇందిరాగాంధీ,భర్త రాజీవ్‌ గాంధీ హత్యలను ప్రత్యక్షంగా చూసిన నేపథ్యంలో.. తాను ప్రధానమంత్రి కావడం కుటుంబానికి ప్రమాదకరమని పిల్లలు భావించారని పేర్కొన్నారు. అయితే,ఎన్నికలకు ముందు తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు,ప్రజలకు వెల్లడించలేదని చెప్పారు. ఎన్నికల సమయంలో పార్టీ ఐక్యతను కాపాడటమే తన ప్రధాన లక్ష్యమని వివరించారు. నాయకత్వంపై అనిశ్చితి ఏర్పడితే ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడుతుందని భావించినట్లు తెలిపారు. ఎన్నికలు సజావుగా ముగిసి, కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చినప్పుడు ప్రధానమంత్రి పదవిపై తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన పరిస్థితి ఎదురైందన్నారు.

ప్రధానమంత్రి పదవి చేపట్టడం తనకు ఇష్టం లేదు: సోనియా
ప్రధాని పదవి చేపట్టాలనే ఆలోచన తనకు ఏమాత్రం ఇష్టం లేదని, అయితే ఆ విషయాన్ని చెబితే పార్టీ నాయకులు ఎంతగా బాధపడతారో కూడా తెలుసని వివరించారు. ఆ సమయంలో తనలో భావోద్వేగాలు క్షణక్షణానికి మారాయని గుర్తుచేసుకున్నారు. మరుసటి రోజు యూపీఏ కూటమి నేతలంతా తన నివాసంలో సమావేశమయ్యారని సోనియా తెలిపారు. దాదాపు గంటపాటు చర్చించిన అనంతరం ప్రధానమంత్రి పదవి చేపట్టడం తనకు ఇష్టం లేదని వారికి స్పష్టం చేసినట్లు చెప్పారు. అయితే, నేతలు తన నిర్ణయాన్ని అంగీకరించలేదని, చుట్టూ చేరి పదవి చేపట్టాలని ఒత్తిడి చేశారని వెల్లడించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సరేనని చెప్పాల్సి వచ్చిందన్నారు. ఆ సమయంలో ప్రియాంక గాంధీ సమావేశ గది బయటే ఉన్నారని తెలిపారు.

రాజీవ్‌ గాంధీ నా పక్కన ఉంటే బాగుండేది: సోనియా
తాను అంగీకరించినట్లు తెలియగానే ఆమె పరుగున వెళ్లి రాహుల్‌కు చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత రాహుల్‌, ప్రియాంక తన వద్దకు వచ్చి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు. ఆ నిర్ణయం తీసుకోవద్దని కోరారని, ఆ సమయంలో ప్రియాంక కళ్లు ఎర్రబడిన దృశ్యం ఇప్పటికీ తనకు గుర్తుందని పేర్కొన్నారు. ఆ రోజు రాత్రి తన మనసులో పెద్ద సంఘర్షణ జరిగిందని సోనియా వివరించారు. ఆ సమయంలో రాజీవ్‌ గాంధీ తన పక్కన ఉంటే బాగుండేదని అనిపించిందన్నారు. ప్రధానమంత్రి పదవి చేపడితే తన విదేశీ మూలాలను ప్రస్తావిస్తూ రాజకీయ ప్రత్యర్థులు వివాదాలు సృష్టిస్తారని ముందుగానే ఊహించినట్లు తెలిపారు.

భారత ప్రజలు నన్ను ఆదరించారు: సోనియా
తాను ప్రేమించే దేశానికి నష్టం జరుగుతుందని తెలిసి ఆ పదవిని ఎలా చేపట్టాలని మనసు ప్రశ్నించిందన్నారు. అదే సమయంలో, రాజీవ్‌ గాంధీని కోల్పోయిన తర్వాత భారత ప్రజలు తనను ఆదరించారని గుర్తుచేసుకున్నారు. వారు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేసి బాధ్యతల నుంచి ఎలా తప్పుకుంటావని మెదడు హెచ్చరించిందని పేర్కొన్నారు. ఇలా కొన్ని గంటలపాటు ఆలోచించిన తర్వాత చివరకు మనసు చెప్పిన నిర్ణయానికే కట్టుబడాలని నిశ్చయించుకున్నట్లు వివరించారు.

అందుకే మన్మోహన్‌ ఎంపిక..
మరుసటి రోజు కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు కూడా తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు సోనియా తెలిపారు. మొదట ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారని, వారి స్పందనతో ఒక దశలో తాను ఆందోళనకు గురయ్యానని చెప్పారు. అయితే, ధైర్యం కూడగట్టుకుని ప్రధానమంత్రి పదవి చేపట్టబోనని స్పష్టంగా ప్రకటించినట్లు వివరించారు. అనంతరం ప్రధానమంత్రి అభ్యర్థిగా మన్మోహన్‌ సింగ్‌ పేరును ప్రతిపాదించినట్లు తెలిపారు. ప్రభుత్వ పదవుల్లో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి కూటమికి నాయకత్వం వహించగలరని భావించినట్లు చెప్పారు. అంతేకాకుండా మన్మోహన్‌ సింగ్‌ కాంగ్రెస్‌లోని ఏ వర్గానికీ ప్రత్యేకంగా మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండేవారని పేర్కొన్నారు.

యూపీఏ ప్రభుత్వానికి వెలుపలి నుంచి మద్దతు ఇచ్చిన కమ్యూనిస్టు పార్టీలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తాయని నమ్మినట్లు తెలిపారు. మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉంటుందనే విశ్వాసం తనకు ఉందని సోనియా గాంధీ తన ఆత్మకథలో వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు