ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) టెర్మినళ్ల ద్వారా నగదు ఉపసంహరణలకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 2008 నుంచి 2022 మధ్యకాలంలో ఇచ్చిన 17 ఉత్తర్వులను రద్దు చేస్తూ నిబంధనలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చింది. ఖాతాదారులు నెలలో ఎన్ని ఉచిత ఏటీఎం లావాదేవీలు వినియోగించుకున్నారు? పరిమితి దాటితే పడే రుసుముల వివరాలను ఎప్పటికప్పుడు అలర్టుల రూపంలో తప్పనిసరిగా తెలియజేయాలని బ్యాంకులను ఆదేశించింది. అలాగే వినియోగదారులకు స్పష్టతనిచ్చేందుకు ఏటీఎంలు మెట్రో నగరాల్లో ఉన్నాయా? నాన్-మెట్రో ప్రాంతాల్లో ఉన్నాయా? అనే విషయాన్ని స్పష్టంగా గుర్తించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.తక్షణమే అమల్లోకి వచ్చిన ఈ నూతన మార్గదర్శకాలు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లకు వర్తిస్తాయి. అయితే ఉచిత లావాదేవీల పరిమితుల్లో ఎలాంటి మార్పూ చేయలేదు. పొదుపు ఖాతాదారులకు తమ సొంత బ్యాంక్ ఏటీఎంలలో నెలకు 5 ఉచిత లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేతర) లభిస్తాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అయితే మెట్రోల్లో 3, నాన్-మెట్రోల్లో 5 ఉచిత లావాదేవీలు యథాతథంగా కొనసాగుతాయి. పరిమితి దాటితే ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.23తో పాటు వర్తించే పన్నులను మాత్రమే రుసుముగా వసూలు చేయాలి. ఏటీఎంలలో గరిష్ఠ నగదు ఉపసంహరణ పరిమితులు, ఉచిత లావాదేవీలు, ఛార్జీల వివరాలను ఇంగ్లిష్, హిందీతో పాటు స్థానిక భాషలో ప్రదర్శించాలి.
సాంకేతిక లోపాలు, హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ సమస్యలు, సర్వర్ వైఫల్యాలు, ఏటీఎంలో నగదు కొరత కారణంగా విఫలమయ్యే లావాదేవీలను ఉచిత పరిమితి కింద లెక్కించకూడదని ఆర్బీఐ తేల్చి చెప్పింది. వాటిపై ఎలాంటి ఛార్జీలు విధించరాదని స్పష్టం చేసింది. బ్యాంక్ లేదా సర్వీస్ ప్రొవైడర్ తప్పిదాల వల్ల లావాదేవీ తిరస్కరణకు గురైనా ఖాతాదారులపై భారం వేయొద్దని సూచించింది.
మరోవైపు వ్యాపార సంస్థల వద్ద పీఓఎస్ టెర్మినళ్ల ద్వారా డెబిట్ కార్డులు, పూర్తి కేవైసీ ప్రీపెయిడ్ కార్డులు, యూపీఐ ద్వారా నగదు తీసుకునే వెసులుబాటు కల్పించింది. పీఓఎస్ వద్ద ఒక లావాదేవీకి గరిష్ఠంగా రూ.2,000, నెలకు మొత్తం రూ.10,000 వరకు నగదు తీసుకోవచ్చు. దీనిపై ఛార్జీలు విధించినా ఆ మొత్తం లావాదేవీ విలువలో 1 శాతానికి మించకూడదు. కొనుగోళ్లు చేయకపోయినా ఈ నగదు పొందే వెసులుబాటు ఉండగా, కొనుగోళ్లతో కలిపి నగదు తీసుకుంటే రశీదుపై ఆ మొత్తాన్ని ప్రత్యేకంగా చూపించాలి.


