విశాలాంధ్ర – అనంతపురం కార్పొరేషన్: అనంతపురం మేయర్ ఎన్నికపై హైకోర్టులో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్ డిమాండ్ చేశారు. శుక్రవారం అనంతపురం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలోని 13 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 12 చోట్ల కూటమి విజయం సాధించినప్పటికీ బీజేపీ నాయకుల దాహం తీరలేదని విమర్శించారు. అనంతపురం కార్పొరేషన్లో మాత్రమే వైసీపీ అభ్యర్థి మేయర్‌గా విజయం సాధించారని తెలిపారు. ఎన్నికలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అక్రమాలు జరిగాయని బీజేపీ హైకోర్టును ఆశ్రయించడం విడ్డూరంగా ఉందన్నారు.నామినేషన్ల ప్రక్రియ నుంచి ఓట్ల లెక్కింపు వరకు బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకుల సమక్షంలోనే ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. ఆ సమయంలో విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి రమేష్‌గౌడ్‌కు బీజేపీ నాయకులు శుభాకాంక్షలు కూడా తెలిపారని గుర్తుచేశారు. ఇప్పుడు ఎన్నికలు సక్రమంగా జరగలేదని, అక్రమాలు చోటుచేసుకున్నాయని కోర్టును ఆశ్రయించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. మేయర్‌గా ఎన్నికైన రమేష్‌గౌడ్‌ను ఒకవైపు బెదిరిస్తూ, మరోవైపు డబ్బు ఆశ చూపి ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఎన్నికల సంఘం, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ వంటి స్వతంత్ర సంస్థలు సైతం స్వతంత్రంగా పనిచేయలేని పరిస్థితి బీజేపీ నాయకుల వల్ల ఏర్పడిందని విమర్శించారు.ఈవీఎంల ట్యాంపరింగ్, ఓట్ల చోరీ, బ్లాక్మెయిల్ రాజకీయాల ద్వారా బీజేపీ ఎన్నికల్లో విజయం సాధిస్తోందని చిత్తూరులో పరకాల ప్రభాకర్ సైతం ఆరోపిస్తున్నారని జగదీష్ పేర్కొన్నారు. ఎన్నికల్లో అక్రమాలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవారు లేరని అన్నారు.కోర్టులను ఆశ్రయించడం, బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడటం ద్వారా అనంతపురంలో మళ్లీ గెలిచేందుకు బీజేపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఓటమిని హుందాగా స్వీకరించడం బీజేపీ, కూటమి నాయకులు అలవర్చుకోవాలని హితవు పలికారు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో న్యాయస్థానంలో చీవాట్లు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, సహాయ కార్యదర్శి రాజారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లింగమయ్య, వి.కె.కృష్ణుడు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


