తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ముఖ గుర్తింపు విధానం (ఎఫ్‌ఆర్‌ఎస్) హాజరు ఆధారంగానే వేతనాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి ఇప్పటివరకు లిఖితపూర్వక ఉత్తర్వులు వెలువడలేదు.
అయితే జిల్లాల కలెక్టర్ల ఆదేశాల మేరకు కొందరు జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈఓలు) ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేస్తున్నారు.
దీంతో టీచర్ల హాజరు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
2025 ఆగస్టు నుంచే ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు 2025 ఆగస్టు నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నారు.అయినప్పటికీ కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ టీచర్లు ఈ విధానంలో హాజరు నమోదు చేయడం లేదు. దీనిపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ఎప్పటికప్పుడు డీఈఓలను హెచ్చరిస్తున్నా ఆశించిన మార్పు కనిపించడం లేదు.ఈ నేపథ్యంలో కలెక్టర్లు ఉపాధ్యాయుల హాజరుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
హాజరుపై కలెక్టర్ల ప్రత్యేక నిఘా
కొన్ని జిల్లాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు తక్కువగా ఉంటోందని సీఎస్ పేర్కొన్నట్లు సమాచారం.ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరును సీరియస్‌గా తీసుకుని పర్యవేక్షించాలని కలెక్టర్లకు సూచించినట్లు తెలిసింది. ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు ఆధారంగా వేతనాలు చెల్లించే విధానాన్ని స్వాగతిస్తున్నామని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య తెలిపారు.అయితే ఈ విషయంలో విద్యాశాఖ సంఘాల నేతలతో చర్చించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఆయన కోరారు.
వికారాబాద్‌లో ఇప్పటికే ఉత్తర్వులు జారీ
ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు ఆధారంగానే టీచర్లు, ఇతర సిబ్బంది వేతనాల బిల్లులు రూపొందించి పంపాలని వికారాబాద్ డీఈఓ ఇటీవల అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు.కలెక్టర్ ఆదేశాల మేరకే ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోనూ అన్ని శాఖల ఉద్యోగులకు ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు ప్రకారమే జీతాలు చెల్లిస్తామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ప్రకటించారు.ఉద్యోగుల హాజరును ఆయన ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోనూ ఇదే దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది.
సెలవులపైనా ఆంక్షలు.. 95 శాతం హాజరు లక్ష్యం
మరోవైపు నవంబరు, డిసెంబరు నెలల్లో విద్యార్థుల హాజరు 95 శాతానికి తగ్గకుండా చూడాలని పాఠశాల విద్యాశాఖ ఇటీవల ఆదేశించింది.ఈ రెండు నెలల్లో ఉపాధ్యాయులు సైతం సెలవులు పెట్టవద్దని సూచించింది. సెలవు తీసుకోవాల్సి వస్తే అదనపు కలెక్టర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని హైదరాబాద్ కలెక్టర్ అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు.ఈ పరిణామం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరును వేతనాలతో అనుసంధానం చేసే దిశగా జిల్లాల వారీగా చర్యలు వేగవంతం కావడం ఉపాధ్యాయుల్లో ఆసక్తి రేపుతోంది.


