తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానం ఏర్పాటై 222 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, అలాగే రాజమండ్రి బార్ అసోసియేషన్ 131 ఏళ్ల వేడుకలను పురస్కరించుకుని రాజమండ్రిలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈ చారిత్రక మైలురాయి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు న్యాయ వ్యవస్థలోని అత్యున్నత ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ వేడుకల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్వీఎన్ భట్టి (సరస వెంకటనారాయణ భట్టి), జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ పి. నరసింహ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు, ఏపీ హైకోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు హాజరయ్యారు. ఒకే వేదికపైకి ఇంతమంది న్యాయకోవిదులు, ప్రభుత్వాధినేత రావడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా ఈస్ట్ గోదావరి జిల్లా కోర్టు సుదీర్ఘ ప్రస్థానం, రాజమండ్రి బార్ అసోసియేషన్ అందించిన సేవలను ప్రతిబింబించేలా రూపొందించిన ప్రత్యేక సావనీర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు, సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి ఘనంగా ఆవిష్కరించారు.
న్యాయ పరిపాలనలో శతాబ్దాల చరిత్ర కలిగిన తూర్పు గోదావరి జిల్లా కోర్టు, స్వాతంత్య్రానికి పూర్వం నుంచే న్యాయవాద వృత్తిలో విశేష సేవలందించిన రాజమండ్రి బార్ అసోసియేషన్ ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించాయని ఈ సందర్భంగా ప్రముఖులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ప్రముఖ న్యాయవాదులు, న్యాయశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


