తాము ద్వేషించే విధానాలను, వ్యక్తులను తు.చ. తప్పకుండా అనుసరించడం మోదీ నాయకత్వంలోని బీజేపీ శైలి. దిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడి మంగళవారానికి మూడు రోజులు గడిచాయి. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేసి రెండు రోజులు దాటింది. కానీ ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరో ఇంకా తేలలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ యాత్ర నుంచి తిరిగి వస్తేనే కానీ ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరో తేలేటట్టు లేదు. దిల్లీ శాసనసభలో 27 ఏళ్ల తరవాత 48 సీట్లు సంపాదించి బీజేపీ ఘన విజయం సాధించింది. పోలింగ్ ఫిబ్రవరి అయిదో తేదీన జరిగితే ఫలితాలు ఎనిమిదినగానీ రాలేదు. తీరా ఫలితాలు వచ్చినా ఇప్పటివరకు దిల్లీ శాసనసభలో బీజేపీ పక్షం నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియే ప్రారంభం కాలేదు. అదీ మోదీ వచ్చిన తరవాతే జరగొచ్చు. పార్లమెంటరీ వ్యవస్థ ప్రకారం ఎన్నికలు పూర్తి అయిన తరవాత ఎక్కువ స్థానాలు సాధించిన పక్షం సమావేశమై తమ నాయకుడిని ఎన్నుకోవాలి. కానీ ఈ పద్ధతిని విడనాడి దశాబ్దాలు గడుస్తోంది. ఇందిరాగాంధీ హయాంలోనే శాసనసభా పక్ష సమావేశాలు లాంఛన ప్రాయంగా తయారయ్యాయి. ఒక వేళ శాసనసభా సమావేశాలు జరిగినా మెజారిటీ ఉన్న పక్షం తమ నాయకుడిని ఎన్నుకునే విధానానికి ఇందిరా గాంధీ తెర దించారు. ఏ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి కావాలో ఆ శాసనసభలో మెజారిటీ సాధించిన పక్షం నిర్ణయించే అవకాశం లేకుండా చేశారు. ఇందిరా గాంధీ హయాంలో శాసనసభా పక్షం సమావేశం జరిగినా కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం ఒకరో ఇద్దరో పరిశీలకులను పంపేది. ఆ పరిశీలకులు కూడా అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్న కొత్తగా ఎన్నికైన శాసనసభ సభ్యుల సమావేశంలో పాల్గొనేవారు. ఒకవేళ ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించాలో ఇందిరా గాంధీ వారికి చెప్పి ఉంటే వారికో సీల్డ్ కవర్ అందించి పంపేవారు. ఆ పరిశీలకులు సీల్డ్ కవర్ విప్పి అందులో ఇందిరా గాంధీ సూచించిన పేరు చదివి వినిపించేవారు. ఇక శాసనసభా పక్షానికి మిగిలిందల్లా శక్తి కొద్దీ కరతాళ ధ్వనులు చేయడమే. కొన్ని సందర్భాలలో శాసన సభ్యుడు కాని నాయకుడిని కూడా ఇందిరా గాంధీ సూచించే వారు. అధిష్ఠానవర్గం అన్న మాట ఇందిరా గాంధీ హయాంలోనే పుట్టింది. అంటే పి.సి.సి. అధ్యక్షులు ఎవరు ఉండాలి, శాసనసభా పక్ష నేతగా ఎవరు ఉండాలి అన్న విషయాన్ని కూడా అధిష్ఠానమే నిర్ణయించే పద్ధతి ఇందిరా గాంధీ హయాంలో సుస్థిరం అయిపోయింది. అప్పుడప్పుడు ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి ఎవరు అవుతారో వాసన అందేది. కానీ చాలా సందర్భాలలో అధిష్ఠానం కూడికలు తీసివేతలు పూర్తి అయిన తరవాతే అధిష్ఠానానికి అంగీకార యోగ్యుడైన వ్యక్తికి ముఖ్యమంత్రి పీఠమో, పి.సి.సి. అధ్యక్ష పదవో దక్కడం మొదలైంది. ఈ విధానాన్ని బీజేపీ తీవ్రంగా విమర్శించేది. కానీ ఇప్పుడు పొల్లు పోకుండా ఇందిరా గాంధీ అనుసరించిన విధానాన్నే బీజేపీ అధినాయకత్వం కూడా అనుసరిస్తోంది. దీన్నిబట్టి మోదీకి కాంగ్రెస్ అంటే ఒళ్లంతా కంపరం ఉన్నా కాంగ్రెస్ హయాంలో మొదలైన ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలంటే ఎక్కడ లేని మక్కువ.
ఈ కారణంగానే మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేసి రెండు రోజులు గడిచినా ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. దిల్లీలో ఘన విజయం సాధించినా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు తమ నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ లేదు. మోదీ విదేశాల నుంచి తిరిగి వచ్చే దాకా జరిగేది ఏమీ ఉండదు. కొన్ని సందర్భాలలో బీజేపీ ఒక వేళ ఎన్నికలలో గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారో ముందే ప్రకటించేది. నిజానికి ఆ నాయకుడి నేతృత్వంలోనే ఎన్నికల ప్రచారం గట్రా జరిగేవి. ఈ మధ్య కాలంలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించకుండానే వివిధ రాష్ట్రాలలో ఎన్నికలలో పాల్గొంటోంది. ఆ తరవాత మోదీ, అమిత్ షా ద్వయానికి నచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి అయిపోతున్నాడు. ఈ క్రమంలో అనామకులు, ఊహకు కూడా అందని నాయకులు ముఖ్యమంత్రి పీఠాలు అధిష్టిస్తున్నారు. ఆ పదవి మీద ఆశలు పెంచుకున్న వారికి నోరెత్తే అవకాశం కూదా ఇవ్వడం లేదు. శనివారం దిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడితే ఆదివారం బీజేపీ సంస్థాగత కార్యదర్శి బి.ఎల్. సంతోష్, దిల్లీ ఎన్నికల బాధ్యుడిగా ఉన్న జే పాండా, బీజేపీ దిల్లీ విభాగం అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ కొత్తగా ఎన్నికైన 48 మంది బీజేపీ శాసనసభ్యులను పిలిపించి మంతనాలు జరిపారు. ఈ మంతనాల్లో శాసనసభా పక్షం నాయకుడు ఎన్నిక ప్రస్తావన సహజంగానే లేదు. కొత్త ఎమ్మెల్యేలతో ఇచ్చకాలు మాట్లాడడంతో పాటు, వారు ఎలా మసలుకోవాలి, దాపరికం లేకుండా ఎలా నడుచుకోవాలి లాంటి సుద్దులు మాత్రం వినిపించారు. ఎవరు దిల్లీ ముఖ్యమంత్రి అవుతారన్న విషయంలో ఊహాగానాలకైతే కొదవ లేదు. అనేకమంది పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. కచ్చితంగా ప్రస్తావనకు వస్తుందనుకున్న రమేశ్ బిధూడీ ఎన్నికలలో ఓడి పోయారు. అనేక ప్రత్యామ్నాయాల గురించి ఊహాగానాలకు, పత్రికల కథనాలకు కొదవే లేదు. ఆదివారం జరిగిన సమావేశంలో కేంద్ర నాయకత్వానికి ప్రతినిధులు అనుకుంటున్న వారు ఎన్నికలు ముగిసిన తరవాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన విషయాన్ని కొత్త ఎమ్మెల్యేలకు మరో సారి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందం టున్నారు. అయితే కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులలో ఒకరే ముఖ్యమంత్రి కావొచ్చునని ఆ నాయకులు సూచన ప్రాయంగా చెప్పారు. శాసనసభా పక్ష సమావేశం జరుగుతుంది. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా వంటి సీనియర్ నాయకులు దిల్లీ ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయిస్తారట. ఈ విషయం ప్రత్యేకంగా ఎవరూ చెప్పనక్కర్లేదు. ఎన్నికలు పూర్తి అయి మెజారిటీ సాధించిన తరవాత కూడా ముఖ్యమంత్రి ఎంపికలో జాప్యం జరగడం బీజేపీ విషయంలో ఇది కొత్తేమీ కాదు. 2024లో ఒరిస్సా శాసనసభ ఎన్నికలు పూర్తి అయిన వారానికి గానీ చరణ్ మారీa ముఖ్యమంత్రి అని తెలియలేదు. 2023లో మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లో కూడా ఫలితాలు వెలువడ్డ తరవాతగానీ ముఖ్యమంత్రి ఎవరో తేలలేదు. ఏ రాష్ట్రంలోనూ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు తమ నాయకుడిని ఎన్నుకునే అవకాశం లేకుండా ఇందిరాగాంధీ ప్రవేశ పెట్టిన పద్ధతిని మోదీ సంపూర్ణంగా అనుసరిస్తున్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అని చాలా రోజులు నినదించిన మోదీ ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదు. కానీ దుస్సంప్రాదాయాలు మాత్రం మోదీకి శిరోధార్యం అయినాయి. మరి మారిందేమిటో!