ఫ్రాన్స్ లో ఓ వైద్యుడు అత్యంత నీచమైన చర్యకు పాల్పడ్డాడు. అనారోగ్యంతో చికిత్స కోసం వచ్చిన రోగులపై అత్యాచారం చేశాడు. ఏళ్ల తరబడి సాగిన ఈ దారుణం ఇటీవల బయటపడింది. ఓ చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా, తాను చేసిన దారుణాలను ఆ వైద్యుడు వెల్లడించాడు. 1989 నుంచి 2004 వరకు 299 మందిపై అఘాయిత్యం చేసినట్లు అంగీకరించాడు. బాధితులలో ఎక్కువమంది చిన్నపిల్లలేనని, బాలికలతో పాటు బాలురపైనా దారుణాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడి బాధితులలో 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలు ఉన్నారని చెప్పారు. అందులో కొంతమందికి తమపై అత్యాచారం జరిగిన విషయమే తెలియదని, పోలీసులు వెలుగులోకి తెచ్చిన నిందితుడి డైరీ ఆధారంగా వారు తెలుసుకున్నారని వివరించారు. బ్రిటానీ అనే ప్రాంతంలో 74 ఏళ్ల జోయెల్ లి స్కౌర్నెక్ ఓ ఆసుపత్రిలో సర్జన్ గా పనిచేసేవాడు. తన వద్దకు చికిత్స కోసం వచ్చే రోగులపై జోయెల్ అఘాయిత్యం చేసేవాడు. వారిని మత్తులోకి పంపాక అత్యాచారం చేసేవాడు. దాదాపు 30 ఏళ్లపాటు ఈ దారుణాలకు పాల్పడ్డాడు. అయితే, 2017లో పొరుగింట్లో ఉంటున్న ఓ ఆరేళ్ల చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు. పాప తల్లిదండ్రులు కేసు పెట్టడంతో పోలీసులు జోయెల్ ను అరెస్టు చేశారు. విచారణలో నలుగురు చిన్నారులపై అత్యాచారం చేసినట్లు గుర్తించిన పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో 2020లో కోర్టు జోయెల్ కు 15 ఏళ్ల శిక్ష విధించింది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. నిందితుడు జోయెల్ ఇంట్లో 3 లక్షలకు పైగా అసభ్య ఫొటోలు బయటపడ్డాయి. 650లకు పైగా అశ్లీల వీడియోలను గుర్తించినట్లు వివరించారు. లైంగిక దాడి జరిపిన బాధితుల వివరాలతో నిందితుడు ఓ డైరీని నిర్వహించినట్టు తెలిపారు. తాజాగా లభించిన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టామని తెలిపారు. చికిత్స కోసం తన దగ్గరికి వచ్చిన చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడినట్లు కోర్టులో జోయెల్ అంగీకరించాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోందని, దోషిగా నిర్ధారణ అయితే జోయెల్ కు మరో 20 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు వివరించారు.
299 మంది రోగులపై అత్యాచారం చేసిన సర్జన్.. ఫ్రాన్స్ లో దారుణం
RELATED ARTICLES