Tuesday, February 25, 2025
Homeపార్టీలపై కార్పొరేట్‌ ఆధిపత్యం

పార్టీలపై కార్పొరేట్‌ ఆధిపత్యం

. మోదీ గుప్పెట్లో రాజ్యాంగ వ్యవస్థలు
. కేసీఆర్‌, జగన్‌ తీరు ప్రజా తీర్పునకు అవమానం
. సీపీఐ కార్యదర్శి నారాయణ

విశాలాంధ్ర –హనుమకొండ: రాజకీయ పార్టీలపై కార్పొరేట్‌ శక్తుల ఆధిపత్యం రోజు రోజుకూ పెరిగిపోతున్నదని, ఇది సమాజానికి ప్రమాదకరమని సీపీఐ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్‌ శక్తులు బలపడుతూ రాజకీయాలను శాసిస్తున్నాయని... అమెరికాలో ఎలన్‌ మస్క్‌, భారత్‌లో అదానీ ఒక్కటవుతున్నారని అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడుతూ కార్పొరేట్లపై, కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కార్పొరేట్లకు లాభాపేక్ష తప్ప ప్రజలకు సేవ చేసే గుణం ఉండదని అన్నారు. ప్రపంచ దేశాలపై ఆధిపత్యాన్ని అమెరికా కోరుకుంటోందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ వ్యవస్థలన్నింటిని గుప్పెట్లో పెట్టుకుంటోందని ఆక్షేపించారు. మోదీది గజదొంగల దోపిడీదారుల రాజ్యమని… జ్యుడీషియల్‌, ఎన్నికల కమిషన్‌, ఈడీ, సీబీఐ వంటి సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని, వాటిని నచ్చినట్లు వాడుకుంటున్నదని విమర్శించారు. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం… జమిలి ఎన్నికలంటూ కొత్త నాటకాలకు తెరతీస్తూ… రాష్ట్రాల స్వతంత్రత, స్వయంప్రతిపత్తిని హరించేందుకు యత్నిస్తున్నాదని నారాయణ దుయ్యబట్టారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో మణిపూర్‌ నాశనమైందని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ గత పాలన బాగుంటే దానికి స్థానాలు 303 నుంచి 242కు ఎందుకు తగ్గాయని నారాయణ ప్రశ్నించారు. ఏ ప్రధానికి రానంత తక్కువ మెజారిటీతో మోదీ గెలిచారని ఎద్దేవా చేశారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జేడీ(యూ) అధినేత నితీశ్‌ కుమార్‌ను లొంగదీసుకొని కొత్త ప్రభుత్వాన్ని మోదీ ఏర్పాటు చేశారని విమర్శించారు. ‘మొన్నటి దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మద్యం కుంభకోణం డబ్బును తీసుకొని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఓడిపోయింది. కాంగ్రెస్‌, ఆప్‌ కలవకుండా మోదీ బ్లాక్‌మెయిల్‌ రాజకీయం చేశారు. నేడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనూ ఇదే జరుగుతోంది. దీంతో పార్టీలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని బీజేపీ చూస్తోంది’ అని నారాయణ అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ అప్పులకుప్ప కావడంతో… నిధులు లేక ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇబ్బంది పడుతోందన్నారు. మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణను రూ.7లక్షల కోట్ల అప్పులోకి బీఆర్‌ఎస్‌ నెట్టిందని, అన్ని రకాల వ్యవస్థలను చెడగొట్టిందని విమర్శించారు. అన్నింటిని చక్కపెట్టేందుకు రేవంత్‌ ప్రభుత్వం తంటాలు పడుతున్నదన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే కాబట్టి… వాటికి వ్యతిరేకించే కాంగ్రెస్‌ను విమర్శించబోమని నారాయణ చెప్పారు. ఏపీలో జగన్‌, తెలంగాణలో కేసీఆర్‌ ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీకి వెళ్లకపోవడం ప్రజా తీర్పును అవమానించడమేనన్నారు. అసెంబ్లీకి వెళ్లని వారు రాజకీయ సన్యాసం తీసుకోవడమ మేలని దుయ్యబట్టారు. రాజకీయ పరివర్తనం` సామాజిక మార్పు కోసం కమ్యూనిస్టుల ప్రయత్నం నిర్విరామంగా కొనసాగుతోందని నారాయణ నొక్కిచెప్పారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులున్నా ప్రజల కోసం పోరాడుతామని, కమ్యూనిస్టుల పునరేకీకరణకు కృషి చేస్తామని వక్కాణించారు. కులగణనను వల్ల రాజకీయాల్లో గుత్తాధిపత్యం పోతుందని, పెనుమార్పులు వస్తాయని, అందుకోసమే దానిని స్వాగతిస్తున్నామన్నారు. సీపీఐకి రెండు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని ఎన్నికల పొత్తులో భాగంగా ఇచ్చిన మాటకు కాంగ్రెస్‌ కట్టుబడాలని నారాయణ అన్నారు. సమావేశంలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌ రావు, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్‌, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేశ్‌, నాయకులు మోతె లింగారెడ్డి, కర్రె లక్ష్మణ్‌, మునిగాల బిక్షపతి, జక్కు రాజు గౌడ్‌, వేల్పుల సారంగపాణి, కొట్టెపాక రవి, బత్తిని సదానందం, మాలోతు శంకర్‌, కామెర వెంకటరమణ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు