ప్రభుత్వం వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదన్న లోకేశ్
వైసీపీ అధినేత జగన్ కు ఏపీ ప్రభుత్వం సరైన భద్రతను కల్పించడం లేదని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. కుట్రలో భాగంగానే జగన్ భద్రతను నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ, జగన్ కు కేంద్ర బలగాలతో భద్రతను కల్పించాలని కోరుతూ కేంద్ర హోం శాఖకు వైసీపీ నేతలు లేఖ కూడా రాశారు. ఇదే అంశంపై మంత్రి నారా లోకేశ్ తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో స్పందించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కంటే ఎక్కువ భద్రతను జగన్ కు కల్పిస్తున్నామని చెప్పారు. జగన్ కు జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కల్పిస్తున్నామని తెలిపారు. వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
తమ ప్రభుత్వం వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదని లోకేశ్ అన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలను లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా పోతుందని శాసనసభ సాక్షిగా గతంలో జగన్ అన్నారని గుర్తు చేశారు. సంఖ్యాబలం లేకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని చెప్పారు. ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు.
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని డిస్టర్బ్ చేసి పోయారని విమర్శించారు. గతంలో తాము నిరసన తెలియజేసినప్పుడు బెంచీల వద్దే ఉండి ధర్నా చేశామని… పోడియం వద్దకు రాలేదని గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదాకు ఎంత బలం ఉండాలో పార్లమెంట్ 121సీ నిబంధనలో స్పష్టంగా ఉందని అన్నారు.