Thursday, March 6, 2025
Homeలోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనదేశ సమైక్యతకు ముప్పు

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనదేశ సమైక్యతకు ముప్పు

. హిందీయేతర రాష్ట్రాల ప్రాతినిథ్యం తగ్గిస్తుంది
. కేంద్రం 1971 జనాభా లెక్కలకు కట్టుబడి ఉండాలి
. తమిళనాడు అఖిలపక్షం ఏకగ్రీవ తీర్మానం
. సంయుక్త కార్యాచరణ కమిటీ ఏర్పాటు

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం 2026లో జరగనున్న లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) ప్రక్రియ ను ఏకగ్రీవంగా తిరస్కరించింది. ‘డీలిమిటేషన్‌ తమిళనాడును బలహీ నపరుస్తుంది. భారతదేశ సమాఖ్య నిర్మాణానికి ముప్పు’ అవుతుందని పేర్కొంది. పార్లమెంటరీ నియోజ కవర్గాల పునర్విభజన, భాష అంశా లపై బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి తమిళనాడు ముఖ్య మంత్రి ఎం.కె.స్టాలిన్‌ నాయకత్వం వహించారు. భవిష్యత్‌లో జరిగే ఏదైనా నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్రం 1971 జనాభా లెక్కలకు కట్టుబడి ఉండాలనే డిమాండ్‌తో సహా ఐదు తీర్మానాలను సమావే శంలో ఏకగ్రీవంగా ఆమోదించారు. స్టాలిన్‌ మాట్లాడుతూ… అఖిలపక్ష సమావేశం డీలిమిటేషన్‌ ప్రక్రియను వ్యతిరేకించలేదని, పరిగణనలోకి తీసుకుంటున్న పద్ధతిని వ్యతిరేకిస్తు న్నట్లు పునరుద్ఘాటించారు. తమిళ నాడు, ఇతర దక్షిణాది రాష్ట్రాల ఎంపీలతో కూడిన సంయుక్త కార్యా చరణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మద్దతును సమీకరించడానికి, నిరసనలు తెలియజేయడానికి, పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి కమిటీ పని చేస్తుంది. 1971 జనాభాల లెక్కల ఆధారంగానే విభజన ప్రక్రియ చేపట్టాలని ప్రధాని మోదీని స్టాలిన్‌ అభ్యర్థించారు. ప్రస్తుత జనాభా ప్రకారం.. పార్లమెంటులో తాము 12 సీట్లు కోల్పోయి.. 10 సీట్లు మాత్రమే వస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇది తమిళ రాజకీయాలపై ప్రత్యక్షంగా దాడి చేయడమేనన్నారు. ఈ చర్య రాష్ట్ర గొంతును నొక్కేస్తుందన్నారు. తాము విభజనకు వ్యతిరేకం కాదని.. కానీ, గత 50 ఏళ్లుగా సామాజిక, ఆర్థిక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన తమకు ఇది శిక్ష కాకూడదన్నారు. 39 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్న రాష్ట్రం స్వరాన్ని కేంద్రం పట్టించుకోలేదని, ఈ సంఖ్య తగ్గితే, అది రాష్ట్రానికి పెద్ద అన్యాయంగా మారుతుందని తెలిపారు. ‘డీలిమిటేషన్‌ కత్తి దక్షిణ భారతదేశం తలపై వేలాడుతోంది, తమిళనాడు తీవ్రంగా ప్రభావితమవుతుంది’ అని ఆరోపించారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని తమిళనాడు హక్కుల కోసం పోరాటం అని అభివర్ణించారు. ఈ సందర్భంగా 2026 జనాభా లెక్కల ఆధారంగా విభజన ప్రక్రియ చేపట్టరాదని అఖిలపక్ష సమావేశం డిమాండ్‌ చేసింది.
55 పార్టీలు… సంస్థలు హాజరు
తమిళనాడు సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో 55 కి పైగా రాజకీయ పార్టీలు, సంస్థలు పాల్గొన్నాయి. ఏఐఏడీఎంకేకు చెందిన డి.జయకుమార్‌, కాంగ్రెస్‌ నాయకుడు సెల్వపెరుంతగై, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్‌, సీపీఎంకు చెందిన షణ్ముగం, వీసీకే నుంచి తిరుమావళవన్‌, ఎండీఎంకే నేత వైకో, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి, ద్రవిడర్‌ కజగంకి చెందిన వీరమణి ఉన్నారు. అయితే బీజేపీ, తమిళ మనీలా కాంగ్రెస్‌, నామ్‌ తమిళర్‌ కట్చి పార్టీలు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నాయి.
హిందీయేతర రాష్ట్రాలకు ప్రమాదం : కమల్‌ హాసన్‌
అఖిలపక్ష సమావేశంలో మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్‌ మాట్లాడుతూ… ఇండియాను ‘హిందీయా’గా మార్చే ప్రయత్నం జరుగుతోందని కేంద్రంపై విమర్శలు చేశారు. ‘‘అన్ని రాష్ట్రాలు హిందీలో మాట్లాడేలా చేసి, ఎన్నికల్లో మెజార్టీ సాధించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. మనం ఇండియా గురించి ఆలోచిస్తుంటే.. వారు మాత్రం హిందీయా కలలుకంటున్నారు’’ అని కమల్‌ హాసన్‌ వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంటరీ నియోజకవర్గాల డీలిమిటేషన్‌ కోసం కేంద్రం చేసిన ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది భారతదేశ సమాఖ్య నిర్మాణాన్ని, దేశ వైవిధ్యాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ఆంధ్ర ప్రదేశ్‌, కర్నాటక, కేరళ, పంజాబ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఈశాన్య రాష్ట్రాలతో సహా తమిళనాడుకు వెలుపల అనేక రాష్ట్రాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చెప్పారు. జనాభా పెరుగుదలను విజయవంతంగా నియంత్రించే రాష్ట్రాలను శిక్షించకూడదనే తన వైఖరిని పునరుద్ఘాటించారు. 1976, 2001లో మాజీ ప్రధానులు తీసుకున్న నిర్ణయాలను ఆయన ఉదహరించారు.
పునర్విభజన అంగీకరించం:టీవీకే అధినేత విజయ్‌
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుందని… దీన్ని అంగీకరించమని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఆయా రాష్ట్రాలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలి. ఈ విభజన ప్రక్రియ తాజా జనాభా లెక్కల ఆధారంగా ఉంటే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. దీన్ని ఏమాత్రం అంగీకరించం. గత 50 ఏళ్లుగా తమిళనాడుతో సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరుగుదలను నియంత్రించాయి.
ఈక్రమంలో ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలు విభజించడం సరికాదు. ఒకరి గెలుపు కోసం ఇంకొకరిని శిక్షించడం అన్యాయం. దక్షిణాది రాష్ట్రాల్లోని నియోజకవర్గాల సంఖ్య తగ్గినా.. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో ఆ సంఖ్య పెరిగినా సహించేది లేదు. అన్ని పార్టీలతో కలిసి దీనిపై పోరాడతాం. ప్రజాప్రతినిధుల కొరత సాధారణ ప్రజలకు సమస్యే కాదు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నాణ్యమైన విద్య, వైద్యం, రోడ్లు వంటి అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముందు వాటిపై దృష్టి సారించాలి’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు