తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉద్యోగులు 2.5 శాతం డీఏ ఇవ్వనున్నట్టు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ డీఏ కారణంగా ప్రతి నెల ఆర్టీసీపై రూ. 3.6 కోట్ల అదనపు భారం పడనుంది. రేపు మహిళా దినోత్సవం సందర్భంగా డీఏ అమలులోకి వస్తుందని మంత్రి చెప్పారు. మహిళా సాధికారత దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా రేపు ఇందిర మహిళాశక్తి బస్సులు ప్రారంభమవుతాయని చెప్పారు. మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా ఈ బస్సులు నడవనున్నాయి. తొలి దశలో 150 బస్సులను మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రాతిపదికన తీసుకోనున్నారు. తరువాతి దశలో 450 బస్సులకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. మొత్తం 600 బస్సులను తీసుకుని నడుపుతారు. ఈ బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు.