భారత కమ్యునిస్టు పార్టీ మైనారిటీ వింగ్ నగర ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్ డిమాండ్
విశాలాంధ్ర -అనంతపురం : ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ముస్లింలపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల బెషరతుగా ముస్లింలకు క్షమాపణ చెప్పాలని భారత కమ్యునిస్టు పార్టీ మైనారిటీ వింగ్ నగర ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆంధ్ర ప్రదేశ్ ఆదోని రాష్ట్ర శాసన సభ్యులు పార్థసారధి మార్చి 4 వ తేదీన స్థానిక రాయచోటిలో శ్రీ వీరభద్ర స్వామి ఊరేగింపు సందర్భంగా జరిగిన గొడవ గురించి అసెంబ్లీ లో ప్రస్తావనకు తీసుకురావటం జరిగిందన్నారు. ప్రజల చేత ఆదోని శాసన సభ్యుడిగా ఎన్నుకోబడిన పార్థసారధి ముస్లిం, హిందూ , క్రైస్తవ మొదలగు వారు అందరూ కలిసి ఓటు వేస్తేనే గెలిచారని కూడా మర్చిపోయారని తెలిపారు. శాసన సభలో ముస్లింలకు అల్లరి మూకలు అని అనుచితంగా మాట్లాడడం ఆయన ఆలోచన దాష్టీకానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఏ మూల ఎలాంటి గొడవ జరిగిన ఇరు వర్గాల తప్పు లేనిదే జరగదు అన్నారు . రాయచోటి గొడవలో నిజానిజాలు ఏంటో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు . గొడవ జరుగుతున్నపుడు అక్కడ పోలీసులు ప్రజలు ఉన్నారన్నారు. .ఎవరైతే ఈ గొడవకు నాంది పలికారో, ఎవరైతే శాంతిని భంగం కలిగించాలని చూసారో వారిని అరెస్టు కూడా చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే పదవిలో ఉండి ఏక పక్ష ధోరణితో వ్యవహరించటం చాలా బాధాకరమన్నారు. తప్పు ఎవరు చేసినా తప్పే . ఒక వర్గానికి టార్గెట్ చేసి మాట్లాడటం మాత్రం సమంజసం కాదని హితవు పలికారు .అరెస్టు అయిన వారి కోసం న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని , మరియు ఇలాంటి మత పరమైన గొడవలను ఎప్పటికి సమాజానికి మంచిది కాదన్నారు. ఈ ఘటనను శాంత పరచటానికి ఏవైతే చర్యలు తీసుకోవాలో దాని మీద ఎమ్మెల్యే దృష్టి సాధించాలన్నారు. మత పరమైన గొడవల ప్రస్తావనలకు తెర లేపి అనవసరంగా విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం హేయ మైన చర్య అన్నారు. . ఇరు వర్గాల మంచి కోరాలి కానీ , సమస్యను ఇంకా జటిల పరిచేలా ఒక ఎమ్మెల్యే వ్యవహరించటం శాసన సభకే అవమానకరమన్నారు. ఆదోని ముస్లిం సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు .ఆదోని ఎమ్మెల్యే తమ నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం కృషి చెయ్యాలని ఇలాంటి గొడవలను ముఖ్యాంశాలుగా పరిగణలోకి తీసుకోకూడదన్నారు. ఎప్పటికైనా శాంతి స్థాపన గురించి ఆలోచించాలి తప్ప ఒక గౌరవ ప్రదమైన ఎమ్మెల్యే హోదా లో ఉండి వర్గ విభేదాలు సృష్టించే విధంగా మాటలు మాట్లాడటం మంచిది కాదన్నారు. సిఎం కలగచేసుకుని పార్థ సారథి మీద తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు . ఈ వివాదం పై ప్రతి ఒక్క రాజకీయ పార్టీలకు , ప్రజా సంఘాలకు , ఇతరత్ర సమాజ శ్రేయస్సు కోరే నాయకులు అందరూ తీవ్రంగా ఖండించాలని కోరారు .