-నిర్మాణాలకు లోపాయి కారిగా సహకరిస్తే సహించేది లేదు
-తాసిల్దార్ తో సిపిఐ నియోజక వర్గ కార్యదర్శి ముసుగు మధు, ప్లంబర్ , సిపిఐ నాయకులు.
విశాలాంధ్ర ధర్మవరం;ధర్మవరం పట్టణం లో నకిలీ ప్లంబర్స్ కు యూనియన్ మాటున భూ దోపిడీకి పాల్పడిన వ్యక్తులను కాపాడుతూ వారి అక్రమ నిర్మాణాలకు లోపాయి కారీగా సహకరిస్తే సహించే ప్రసక్తి ఉండదని ధర్మవరం నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి ముసుగు మధు పేర్కొన్నారు. పట్టణంలోని 650 – 2 సర్వే నంబర్లు ప్లంబర్ యూనియన్ పేరు చెప్పుకొని ముగ్గురు వ్యక్తులు కుటుంబ సభ్యుల పేరిట కోట్లాది రూపాయల విలువైన భూములను దోచేసిన సంగతి తెలిసిందే. దీనిపై సిపిఐ నాయకులు ఆర్డీవో కార్యాలయాన్ని దిబ్బంధం చేయగా సదరు భూమిలో జరిగిన అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవడంతో పాటు విచారించి అర్హులైన పేదలకు అందేలా చూస్తామని తహసిల్దార్ హామీ ఇచ్చారు. తాసిల్దార్ హామీలు సైతం ఖాతరు చేస్తూ యూనియన్ నాయకులు నిర్మాణాలు కొనసాగిస్తుండడంపై సిపిఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తాసిల్దార్ని కలిసి జరుగుతున్న తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధికారులు చెప్పిన నిర్మాణాలు కొనసాగిస్తున్నారంటే మీ మధ్య లోపాయి కారి ఒప్పందం కుదిరినట్లు భావించాల్సి వస్తుందన్నారు. ఆక్రమించిన ప్లాట్లు ఇంటి నిర్మాణాలు ఆపకపోతే శుక్రవారం ఉదయం తహసిల్దార్ కార్యాలయాన్ని దిగ్భంధం చేయాల్సి వస్తుందని వారు తాసిల్దారును హెచ్చరించారు. ఇక్కడ జరుగుతున్న తథంగం చూస్తుంటే అక్రమార్కులకు అండదండ లభించడం వెనక భారీ ఎత్తున ముడుపులు మారాయని వారు ఆరోపించారు. అక్రమార్కులను గుర్తించి వారి పైన కేసులు పెట్టేవరకు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని వారు పేర్కొన్నారు. అనంతరం తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవి, సహాయ కార్యదర్శి రమణ చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు లక్ష్మీనారాయణ వెంకటస్వామి, ప్లంబర్స్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు గోవిందరాజులు లక్ష్మీనారాయణ, అఖిలభారత యువజన సమైక్య సకల రాజ తదితరులు పాల్గొన్నారు.