ఎవరిది ఒరిజినల్?ఎవరు డూప్లికేటో తెల్చుకుందాం? రండి
ప్లంబర్స్ భూమంతా మీ జాగిర్ అనుకున్నారా?
–మీరు నిజాయితీపరులైతే ప్లాట్ల గోల్మాల్ పై విచారణకు సిద్ధమా?
తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వ్యతిరేకవర్గం
విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరం ప్లంబర్ యూనియన్ లో విభేదాలు భగ్గుమన్నాయి. తోటి యూనియన్ లోని ప్లంబర్స్ ను పక్కనపెట్టి డబ్బుల కోసం తమ కేటాయించిన ప్లాట్లను తమ కుటుంబ సభ్యుల పేరిట తీసుకోవడమే కాకుండా, మిగిలిన ప్లాట్లను సైతం ఇష్టారాజ్యంగా అమ్ముకొని అక్రమాలకు పాల్పడ్డారంటూ కమిటీలోని ముగ్గురు వ్యక్తులపై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. శుక్రవారం ప్లంబర్స్ యూనియన్ లోని వ్యతిరేక వర్గం అంతా ఏకమై తమకు జరిగిన అన్యాయంపై తమ గోడును వెళ్ళబోసుకున్నారు. ఈ సందర్భంగా వ్యతిరేక వర్గ నాయకులు గోవిందరాజులు, భాష , ఆ భూమి యజమాని నారాయణస్వామి లు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ప్లంబర్ యూనియన్ లో నాయకులమని చెప్పుకుంటున్న సురేంద్ర, రాజు, లతీప్ లు తోటి ప్లంబర్స్ ను చిత్రహింసలు గురి చేయడం ఎంతవరకు సమంజసం అని తెలిపారు. రోజూ కష్టపడితే గాని కడుపు నిండని మాలాంటి పేద ప్లంబర్ నుంచి లక్షలాది రూపాయలు డబ్బులు డిమాండ్ చేయడంతో మా వల్ల కాదు అన్నందుకు యూనియన్ నుంచి తొలగించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇస్తే చాలు ప్లంబర్స్ కాకపోయినా పట్టాలు యదేచ్చగా అమ్మేసుకుని అసలైన, అర్హులకు మొండి చేయి చూపారని వారు విలపించారు. యూనియన్ తరపున మేమంతా కోర్టుకు వెళ్లామని కేసు కోర్టులో ఉండడంవల్ల అప్పటినుంచి మౌనంగా ఉంటే ఆ యూనియన్ లోని ముగ్గురు వ్యక్తులు లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకొని తమకే తెలియకుండా ఆ స్థలాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని దాదాపు 40 ప్లాట్లు తమ బంధువులు స్నేహితులు తమ కింద పనిచేసే వారికే కాకుండా సహకరించిన కొందరు రాజకీయ నాయకులు సైతం పట్టాలిచ్చారని వారూ విమర్శించారు. అలా ఎవరు పడితే వారికి ఇవ్వడానికి మీ సొంత జాగీర్ కాదని వారు ప్రశ్నించారు. మీరు నిజాయితీపరులైతే పట్టాల పంపిణీలో ఎవరెవరికి ఇచ్చారు విచారణకు సిద్ధమా? అంటూ వారు ఛాలెంజ్ విసిరారు. ఆ పట్టాలు పొందిన వారిలో ఎవరు ఒరిజినల్ లో? ఎవరు డూప్లికేటో? తేల్చుకుందామంటూ సవాలు విసిరారు . అంతేకాదు మీరు రండి, మేము వస్తాం ఎవరు నిజమైన ప్లంబరో ఫీల్డ్ లోకి వెళ్లి పనిచేస్తే తెలుస్తుందని వారు సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం 76 ప్లాట్లు మంజూరు చేస్తే అందులో నిజమైన వారు 20 మందికి మించి లేరని, మిగతావన్నీ ఎలా అడ్డదారి వెళ్ళాయో పట్టణ ప్రజలందరికీ తెలుసు అన్నారు. ఇప్పటికైనా మీ అవినీతి బాగోతం బయటకు పడక ముందే మీరు బినామీ పేర్లతో దోచుకున్న పట్టాలను వెంటనే వెనక్కి ఇవ్వాలని లేదంటే తాము క్షేత్రస్థాయిలోకి పోరాటం చేయాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్లంబర్స్,నాయకులు, గోవిందరాజు, లక్ష్మీనారాయణ,రామక్రిష్ణ, నాగేంద్ర,సుబ్బయ్య, చిన్న, నాగరాజు, ఆంజనేయులు, మసూద్,తాజ్, శివయ్య, తదితరులు పాల్గొన్నారు.-