Friday, May 9, 2025
Home‘మద్యం’పై బీజేపీ రగడ

‘మద్యం’పై బీజేపీ రగడ

తమిళనాడులో కాషాయపార్టీ నేతల అరెస్టు

చెన్నై: దిల్లీ తరహాలోనే వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తమిళనాడులో కూడా మద్యం కుంభకోణం పేరుతో అధికార డీఎంకేని ఎలాగైనా అప్రదిష్టపాల్జేయాలని కంకణం కట్టుకున్న బీజేపీ…. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ప్రభుత్వ యాజమాన్యంలోని మద్యం రిటైలర్‌, తమిళనాడు స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ (టాస్మాక్‌)లో రూ.1,000 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఆందోళనకు దిగింది. టాస్మాక్‌ మద్యం కుంభకోణంపై దర్యాప్తును కోరుతూ 17న నిరసనకు దిగబోతున్నామని ప్రకటించిన తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్ర కార్యదర్శి వినోజ్‌ పీ సెల్వం సహా అనేకమంది బీజేపీ నేతలను సోమవారం ఉదయమే పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం 11 గంటలకు చెన్నై ఎగ్మోర్‌లోని టాస్మాక్‌ ప్రధాన కార్యాలయం వెలుపల ధర్నా చేయాలని నిర్ణయించుకున్న అన్నామలై… ఆ వేదిక వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా అంతకుముందుగానే అక్కరైలోని ఆయన నివాసం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అలాగే బీజేపీ సీనియర్‌ నేత, తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, మహిళా మోర్చా అధ్యక్షురాలు, కోయంబత్తూర్‌ సౌత్‌ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్‌, మరో ఎమ్మెల్యే సరస్వతి సహా అనేక మంది సీనియర్‌ బీజేపీ నాయకులను కూడా నగరంలోని వివిధ ప్రదేశాలలో అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేత సౌందరరాజన్‌ తన నిర్బంధంపై మాట్లాడుతూ ‘వారు మమ్మల్ని ఇంటి నుండి బయటకు వెళ్లనివ్వడం లేదు. మా కార్యకర్తలలో మూడు వందల మందిని ఒక కల్యాణ మండపంలో నిర్బంధిం చారు. టీఏఎస్‌ఎంఏసీలో జరిగిన వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణంపై దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నామని’ అన్నారు. పోలీస్‌ నిర్బంధాలను అన్నామలై ఖండిరచారు. డీఎంకే ప్రభుత్వం భయంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ‘ఎక్స్‌’ ఆయన స్పందిస్తూ… ‘డీఎంకే ప్రభుత్వం భయంతో వణికిపోతోంది. అందుకే బీజేపీ నేతలైన తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్ర కార్యదర్శి వినోజ్‌ పి సెల్వన్‌ రాష్ట్ర జిల్లా నిర్వాహకులను గృహ నిర్బంధంలో ఉంచింది. వారు నిరసనలో పాల్గొనకుండా నిర్బంధించింది. తేదీ ప్రకటిం చకుండా అకస్మాత్తుగా నిరసన ప్రారంభిస్తే ఏం చేయగలరు?’ అని అన్నామలై ప్రశ్నించారు. కాగా డీఎంకే ప్రభుత్వం బీజేపీ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిరచింది. ప్రతిపక్షపాలిత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని, కేంద్ర సంస్థలు పనిచేస్తున్నాయని డీఎంకే నేతలు ఆరోపించారు.
రూ. వెయ్యికోట్ల అవినీతి: ఈడీ
తమిళనాడు స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టాస్మాక్‌)లో రూ.1,000 కోట్లకు పైగా అవినీతి చోటుచేసుకుందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని టాస్మాక్‌.. రాష్ట్రవ్యాప్తంగా 4,830 దుకాణాల ద్వారా మద్యం విక్రయాలు సాగిస్తోంది. వీటిల్లో ప్రతిరోజూ సరాసరిన రూ.150 కోట్ల మేర వ్యాపారం జరుగుతోంది. టాస్మాక్‌ సంస్థ ఏడు కంపెనీల నుంచి బీర్లు, 11 కంపెనీల నుంచి మద్యం రకాలు కొనుగోలు చేస్తోంది. మద్యం దుకాణాల్లో నిర్వహించే బార్లు ప్రధానంగా అధికార పార్టీ నేతలకు చెందినవనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైలోని టాస్మాక్‌ ప్రధాన కార్యాలయం, మద్యం విక్రయించే సంస్థలు, టాస్మాక్‌ మాజీ అధికారుల ఇళ్లలో ఈ నెల 6న ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. మూడు రోజులు సాగిన ఈ తనిఖీల్లో కీలక పత్రాలు, భారీగా నగదు లభ్యమైనట్లు సమాచారం. దర్యాప్తు అనంతరం టెండర్‌ ప్రక్రియలలో అవకతవకలు బయటపడ్డాయని… ప్రాథమిక అర్హత ప్రమాణాలను పాటించని బిడ్డర్లకు రూ.100 కోట్ల విలువైన రవాణా ఒప్పందాలు జరిగాయని, ఒకే దరఖాస్తుదారు ఉన్నప్పటికీ కొన్ని టెండర్లు మంజూరు చేయబడ్డాయని ఈడీ ప్రకటించింది. ప్రముఖ మద్యం తయారీదారులు – ఎస్‌ఎన్‌జె, కాల్స్‌, అక్కోర్డ్‌, ఎస్‌ఎఐఎఫ్‌ఎల్‌… శివ డిస్టిలరీ – దేవి బాటిల్స్‌, క్రిస్టల్‌ బాటిల్స్‌ వంటి బాట్లింగ్‌ కంపెనీల ద్వారా లెక్కల్లో లేని నగదును తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నిధులను టాస్మాక్‌ అధికారులకు లంచం ఇవ్వడానికి ఉపయోగించారని ఆరోపణలు ఉన్నాయి. సిబ్బంది బదిలీలలో లంచం తీసుకోవడాన్ని కూడా ఈడీ పరిశీలిస్తోంది. అలాగే టాస్మాక్‌ దుకాణాలు క్రమం తప్పకుండా వినియోగదారుల నుండి బాటిల్‌కు రూ.10 నుండి రూ.30 వరకు అధికంగా వసూలు చేస్తున్నాయని ఆరోపణలున్నాయి. పెరిగిన ఖర్చులు, నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, అక్రమ నగదు ప్రవాహ చక్రం సృష్టించబడిరదని ఈడీ ఆరోపించింది. పెద్ద మొత్తాలను స్వాహా చేయడానికి ముంద డిస్టిలరీలు లంచం, అక్రమ చెల్లింపుల కోసం ముఖ్యంగా నకిలీ బాటిల్‌ తయారీ ఒప్పందాల ద్వారా ఖర్చులను క్రమపద్ధతిలో పెంచాయని ఆధారాలు సూచిస్తున్నాయని ఈడీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు