. అందుబాటులోకి గ్రీన్ పవర్ పాలసీ
. 2030 నాటికి 20 వేల మెగావాట్ల ఉత్పత్తి
. రూ.లక్ష కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చిన కంపెనీలు
. శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
విశాలాంధ్ర – హైదరాబాద్: తక్కువ ధరతో, కాలుష్య రహితంగా విద్యుత్ అందించడమే లక్ష్యంగా సమగ్ర గ్రీన్ పవర్ పాలసీని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రూ.80 వేల నుంచి రూ.లక్ష కోట్ల వరకు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడుదారులు ముందుకు వచ్చారని చెప్పారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఎంఓయులు కుదుర్చుకున్నాయని వివరించారు. శాసనమండలిలో సోమవారం తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపై ఎమ్మెల్సీలు బల్మూరు వెంకట్, మహేష్ కుమార్ గౌడ్, కల్వకుంట్ల కవిత, భాను ప్రసాద్ ప్రశ్నలకు భట్టి సమాధానం ఇచ్చారు. 2030 నాటికి 20 వేల మెగావాట్లు, 2040 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యమన్నారు. సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ వంటి విభాగాల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. గ్రీన్ పవర్ లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు సింగిల్ విండో పద్ధతుల్లో అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వ, దేవదాయ శాఖ ఖాళీ భూముల్లో సోలార్, ఫ్లోటింగ్ సోలార్ ద్వారా గ్రీన్ పవర్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వివరించారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి జెన్కోతో ఎంఓయు చేసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ ఖాళీ భూములను వీరికి లీజుకు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహిస్తున్నామన్నారు. నిరుద్యోగులు… బ్యాంకుల సహకారంతో గ్రీన్ పవర్ ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉందన్నారు. ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వంతో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు రిజిస్ట్రేషన్‌లో ట్యాక్స్ ఫ్రీ చేశామని ఫలితంగా విక్రయాలు పెరిగాయని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,938 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. ఉత్సాహవంతులు ముందుకు వస్తే ఎలక్ట్రికల్ చార్జింగ్ స్టేషన్‌లు పెట్టుకునేందుకు అనుమతులు ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రికల్, బ్యాటరీ బేస్డ్ బస్సులు ప్రవేశ పెడుతూ, డీజిల్ బస్సులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నామని వివరించారు. హైదరాబాద్ సిటీలో డీజిల్ ఆటోలకు అనుమతి ఇవ్వడం లేదని, బ్యాటరీతో నడిచే ఆటోలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కాలుష్య కార్యక్రమం నగరం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వెలుపులకు తరలించాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు.