విశాలాంధ్ర ధర్మవరం; తలసేమియా సమస్యతో బాధపడుతున్న చిన్నారి శస్త్రచికిత్స కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 10 లక్షలు మంజూరు చేయించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మవరం పట్టణంలోని సంజయ్ నగర్ కు చెందిన పిక్కిలి లక్ష్మీనారాయణ, పిక్కిలి రాజేశ్వరి ల 2 సంవత్సరాల కుమారుడు విష్ణు తేజ గత ఒక సంవత్సరం నుండి తలసేమియా సమస్యతో బాధపడుతుండేవారని తెలిపారు. వైద్యుల సలహా మేరకు శస్త్రచికిత్స చేయించాల్సి ఉండగా, దానికోసం తగినంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తమ బాబు చికిత్స కోసం సాయం చేయాల్సిందిగా వారు కోరారు. ఇందులో భాగంగా హైదరాబాదులోని అమెరికన్ ఆంకాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారి శస్త్రచికిత్స కోసం మంత్రి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వెంటనే రూ. 10 లక్షలు మంజూరు చేయించారు. దీనికి సంబంధించిన మంజూరు పత్రంతో పాటు మంత్రి లేఖను మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు ఎన్డీఏ కార్యాలయంలో ఆ చిన్నారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ చిన్నారి శస్త్ర చికిత్సకు కావాల్సిన సహాయంతో పాటు మెరుగైన వైద్య సౌకర్యాలను అందించాల్సిందిగా మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ ఆసుపత్రి వారిని కోరారని, ఆ చిన్నారి శస్త్ర చికిత్స విజయవంతమై త్వరగా కోలుకోవాల్సిందిగా మంత్రి ఆకాంక్షిస్తున్నారని ఆయన తెలియజేశారు. తమ చిన్నారి ప్రాణాలను నిలబెట్టడం కోసం మంత్రివర్యులు సత్య కుమార్ చేసిన సహాయానికి ఆ చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.
చిన్నారి తలసేమియా శస్త్రచికిత్స కోసం రూ.10 లక్షలు మంజూరు
RELATED ARTICLES