Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

ఓటీఎస్‌ వచ్చేస్తోంది !

25నుంచి డేటా అప్‌లోడ్‌

గ్రామ, వార్డు సచివాలయాల్లోనే సొమ్ము చెల్లింపులు
దీనికి ‘జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం’గా నామకరణం
సమీక్షించిన సీఎం జగన్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : గృహ నిర్మాణ పథకంలో వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) పథకం అమలుకు శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈనెల 25వ తేదీ నుంచే ఇందుకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులతో ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ డేటా అప్‌లోడ్‌ చేసేం దుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈనెల 16వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఓటీఎస్‌ పథకానికి ఆమోదం తెలిపిన విషయం తెల్సిందే. దీనిపై నాలుగు రోజుల వ్యవధిలోనే ఏ విధంగా అమలు చేయాలనే దానిపై అధికారులు విధివిధానాలు సిద్ధం చేసి సోమవారం సీఎం జగన్‌ నిర్వహించిన సమీక్షా సమావేశంలో అందజేశారు. 1983 నుంచి ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ రుణాలు పొందిన పక్కా గృహల లబ్ధిదారులకు ఈ పథకం వర్తింపజేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, మున్సిపాలిటీల్లో రూ.15వేలు, అర్బన్‌ ప్రాంతాల్లో 20వేలు చెల్లిస్తే వారికి పూర్తి హక్కు కల్పిస్తూ ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చేస్తుంది. దీనికి ‘జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం’గా పేరు ఖరారు చేశారు. పథకం అమలు కోసం రూపొందించిన ప్రతిపాదనలను అధికారులు వివరించగా, ఈ డేటాను అన్ని సచివాలయాలకు పంపాలని సీఎం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాల యాల్లో అర్హుల జాబితాలు డిస్‌ప్లే చేసి, ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకం సొమ్మను అక్కడే చెల్లించేలా వెసులుబాటు కల్పించాలని సీఎం సూచించారు. నిర్దేశిత రుసుము చెల్లింపుతో వారికి ఇంటిపైన, స్థలాలపైన పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేయాలన్నారు. ఓటీఎస్‌ పథకం అమలు ప్రక్రియ గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా సాగాలని సీఎం స్పష్టం చేశారు. ఆ తర్వాత పేదలందరికీ ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్షించారు. ఇప్పటివరకూ 10.31లక్షల ఇళ్లు కార్యరూపం దాల్చాయని, ఈ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు, మేస్త్రీలతో కలిపి 18వేలకుపైగా గ్రూపులను ఏర్పాటు చేశామని, ఖర్చులు తగ్గించుకునే విధానాల్లో భాగంగా ఇళ్లనిర్మాణం జరుగుతున్న లే అవుట్ల వద్దే ఇటుక తయారీ యూనిట్లను ప్రోత్సహిస్తున్నామని అధికారులు వివరించారు. లబ్ధిదారులు ఎంచుకున్న ఆప్షన్‌ 3 కింద ప్రభుత్వమే కట్టించనున్న ఇళ్ల నిర్మాణ పనులు అక్టోబరు 25 నుంచి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకో వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్‌, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగ నాధరాజు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, గృహనిర్మాణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌, రెవెన్యూశాఖ (భూములు) ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, ఆర్థికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్‌, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సెక్రటరీ రాహుల్‌ పాండే, ఏపీఎస్‌ హెచ్‌సీఎల్‌ ఎండీ ఎన్‌ భరత్‌గుప్తా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img