. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం
. క్రైస్తవులు, సిక్కులపైనే బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్ గురి
. కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
. ఏఐసీసీ సదస్సులో రాహుల్ గాంధీ
అహ్మదాబాద్ : వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ చట్టాన్ని తేవడమంటే ముస్లింల మత స్వేచ్ఛపై దాడి చేయడమే అవుతుందని వ్యాఖ్యానించారు. క్రైస్తవులు, సిక్కుల వంటి ఇతర మైనారిటీల హక్కులను హరించడమే బీజేపీఆర్‌ఎస్‌ఎస్ తదుపరి లక్ష్యమని హెచ్చరించారు. గుజరాత్, అహ్మదాబాద్‌లో సబర్మతి నది తీరాన జరిగే ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ
ఆర్ఎస్ఎస్పై విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించే సుంకాల ఒత్తిళ్లకు మోదీ ప్రభుత్వం తలొగ్గడంతో ఆర్థిక తుపాను రాబోతోందని హెచ్చరించారు. ‘ట్రంప్‌ను మోదీ హత్తుకున్న ఫొటో చూశారా? ఈసారి కౌలిగించుకోం… కొత్త టారిఫ్‌లు విధిస్తామని ఆయన (ట్రంప్) మోదీకి స్పష్టంచేశారు. ప్రధాని మాత్రం మౌనం వహించారు. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం రెండు రోజులు పార్లమెంటులో నాటకమాడారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రధాని ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్‌తో మోదీ ఇటీవల భేటీ కావడాన్ని ప్రస్తావిస్తూ… ‘బంగ్లాదేశీ నాయకుడు ప్రతికూల వ్యాఖ్యలు చేస్తుంటే మోదీ పక్కనే కూర్చొని విన్నారు. ఆయన 56 అంగుళాల ఛాతీ ఏమైంది’ అంటూ ప్రధానిని రాహుల్ ఎద్దేవా చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ మ్యాగజైన్ ఇటీవల ప్రచురించిన వ్యాసాన్ని ప్రస్తావిస్తూ… క్రైస్తవులు, సిక్కుల హక్కులు, ఆస్తులపై బీజేపీఆర్‌ఎస్‌ఎస్ కన్ను పడిరదన్నారు. ఈ మైనారిటీలే వారి తదుపరి లక్ష్యమని వ్యాఖ్యానించారు. కులగణన గురించి మాట్లాడుతూ 50 శాతం రిజర్వేషన్ పరిమితిని తొలగిస్తామని, తెలంగాణలో చేసినట్టే దేశం మొత్తం చేస్తామని రాహుల్ ప్రకటించారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతం రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. దేశ వ్యవస్థలన్నీ తమ గుప్పెట్లో ఉండాలని వారు కోరుకుంటారని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని పరిక్షించుకోవడం సులువు కాదని, ఇందుకోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులకు రాహుల్ పిలుపునిచ్చారు. ఎల్లప్పుడు నిజం పక్షాన, ప్రజల పక్షాన నిలవాలన్నారు. వివాదాస్పద అగ్నిపథ్ పథకాన్ని కూడా ప్రస్తావించారు. ‘మీరు అగ్నివీర్‌గా ఉండి, యుద్ధంలో చనిపోతే అమర సైనికుడి హోదా కానీ పింఛన్ కానీ మీకు రాదు. మీ పక్కవారికి వస్తుంది అని యువతతో మోదీ ప్రభుత్వం చెబుతోంది’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో దళితులు, వెనుకబడిన వర్గాల అణచివేతను ఆక్షేపించారు. కుల గణన జరిగితే తప్ప సామాజిక సమ న్యాయం సాధ్యం కాదని స్పష్టంచేశారు. వాస్తవాలను కప్పిపుచ్చేందుకే కుల గణనకు మోదీ సర్కారు ముందుకు రావడం లేదన్నారు. ఎంత దాచినా నిజం దాగదని, కులగణన జరిగి తీరుతుందని రాహుల్ నొక్కిచెప్పారు. వందేళ్ల కిందట మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యారని,150 కిందట సర్దార్ వల్లభాయి పటేల్ జన్మించారని, ఈ ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి మూలమని అన్నారు. అణగారిన వర్గం కోసం పనిచేసే నాయకుడిగా తన గురించి చెప్పుకున్నారు. ఐక్యంగా ముందుకెళితేనే విజయం సొంతం కాగలదని, తమ ముందరన్న సవాళ్లు సంక్లిష్టమైనవని, పోరాట క్రమంలో ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ‘న్యాయపథ్’కు ఆమోదం భారతీయులంతా ఐక్యంగా ఉండటమే తమ జాతీయవాదమని, పౌరులను విభజించడమే బీజేపీ
ఆర్‌ఎస్‌ఎస్ నకిలీజాతీయవాదమని కాంగ్రెస్ విమర్శించింది. ఏఐసీసీ సమావేశంలో భాగంగా ‘న్యాయపథ్’ తీర్మానాన్ని ఆమోదించింది. జాతీయవాదంపై దృష్టితో ఈ తీర్మానాన్ని చేసినట్లు వెల్లడిరచింది. ప్రాదేశిక సమగ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం... భారతీయుల సాధికారతకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. వెనుకబడిన, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ, సమాన స్థాయి పురోగతి సాధించడమే నిజమైన జాతీయవాదమని వెల్లడిరచింది. రాజ్యాంగ విద్రోహ శక్తుల విశాసకార విధానాలు సాగనివ్వమని కాంగ్రెస్ సంకల్పించింది. ఒక దేశం, ఒకే ఎన్నిక వంటి ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడిచే ప్రతి చర్యను ప్రతిఘటిస్తామని పేర్కొంది. జమ్మూకశ్మీర్‌కు సంపూర్ణ రాష్ట్ర హోదా సాధన, విద్యా వ్యవస్థలో స్వాతంత్య్రం, స్వేచ్ఛా ఆలోచన పద్ధతుల ఆచరణ, పారదర్శకంగా పునర్విభజన జరగడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉన్నట్లు తీర్మానం పేర్కొంది. నిర్మాణాత్మక సహకారం, సమ్మిళిత కసరత్తుల స్ఫూర్తితో ముందుకెళుతూ, ప్రజల సమస్యలపై పోరాడటానికి ఇండియా ఐక్య సంఘటనను ఏర్పాటు చేసుకున్నాం... భవిష్యత్‌లోనూ ఇదే పంథా అనుసరిస్తామని కాంగ్రెస్ స్పష్టంచేసింది. గుజరాత్‌పై ప్రత్యేక తీర్మానం గుజరాత్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఏఐసీసీ సందర్భంగా ప్రత్యేకంగా తీర్మానం జరిగింది. దీనిని పార్టీ గుజరాత్ అధికార ప్రతినిధి హీరేన్ బంకర్ ధ్రువీకరించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘గుజరాత్‌కు కాంగ్రెస్ ఎందుకు అవసరం’ అనే శీర్షికతో జరిగిన ఈ తీర్మానంలో 30 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న తమ పార్టీ అధికారంలోకి రావడం కోసం అనుసరించే వ్యూహాలను పొందుపర్చాం. ‘నూతన గుజరాత్, నూతన కాంగ్రెస్’ నినాదంతో ముందుకెళుతున్నాం’ అని తెలిపారు. 1960
70లో గుజరాత్ అభివృద్ధికి పునాది వేసింది కాంగ్రెస్ అని గుర్తుచేశారు. బీజేపీ పాలనలో గుజరాత్ అభివృద్ధి కుంటుపడినందునే ఏఐసీసీ ఇలా ప్రత్యేక తీర్మానం చేసిందని జైరాం రమేశ్ వెల్లడిరచారు.