రామగుండంలో అధిక తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం ఉందన్న ఎర్త్‌కేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్
ధ్రువీకరించని ప్రభుత్వం, శాస్త్రీయ సంస్థలు..అయితే, అప్రమత్తత మాత్రం అవసమంటున్న నిపుణులు
తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూకంపం సంభవించే అవకాశం ఉందని ‘ఎర్త్‌కేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్’ హెచ్చరికలు జారీచేసింది. తమ పరిశోధనల ప్రకారం రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. దాని ప్రభావం హైదరాబాద్, వరంగల్ నుంచి అమరావతి, మహారాష్ట్ర వరకు ఉండవచ్చని పేర్కొంది. అయితే, ఈ విషయాన్ని ప్రభుత్వం కానీ, శాస్త్రీయ సంస్థలు కానీ ధృవీకరించలేదు. భూకంపాలను ముందస్తుగా అంచనా వేయడం సాధ్యం కాదని అంటున్నారు.
అయితే డిసెంబర్ 4, 2024న ములుగు జిల్లా మేడారం దగ్గర 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా కనిపించింది. అయితే తెలంగాణ ప్రాంతం సాధారణంగా తక్కువ భూకంప తీవ్రత కలిగిన జోన్-2లో ఉంది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఫాల్ట్ జోన్ ఉండటం వల్ల.. అప్పుడప్పుడు భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. గతంలోనూ ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చినా అవి నష్టం కలిగించలేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పెద్దపల్లి జిల్లాకు భూకంపం హెచ్చరిక చేస్తూ ఎర్త్‌క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ సమాచారంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు.